Begin typing your search above and press return to search.

అదానీపై సుప్రీం కమిటీ.. ఎవరెవరు సభ్యులంటే..?

By:  Tupaki Desk   |   2 March 2023 1:11 PM GMT
అదానీపై సుప్రీం కమిటీ.. ఎవరెవరు సభ్యులంటే..?
X
అదానీ గ్రూప్ సంస్థల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక నెల రోజుల నుంచి భారత రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. గత 9 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే మోదీ నోరు విప్పి సమాధానం చెప్పేదాక అదానీ సంస్థలకు సంబంధించి రోజుకు మూడు ప్రశ్నలు వేస్తూనే ఉంటామని ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కూడా. బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలే కాక తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వంటి పార్టీలూ అదానీ విషయమై మోదీని ప్రశ్నిస్తున్నాయి. కాగా, అదానీ సంస్థల ఆర్థిక అవకతవకలపై ఇప్పటివరకు బీజేపీ తరఫున ఎటువంటి ప్రకటనా రాలేదు. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందంటూ, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక ను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది.

మరోవైపు వాస్తవాలు ఏమిటో తెలియాల్సి ఉన్నప్పటికీ హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ చర్యలను బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీం.. గురువారం తీర్పునిచ్చింది.

మేమే కమిటీ వేస్తామంటూ..

అదానీ-హిండెన్‌ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు గురువారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం కొన్ని రోజుల కిందట.. తామే కమిటీని వేస్తామని తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ విషయంలో కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించింది. తామే ఒక కమిటీని నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. ఇందుకు అనుగునంగానే గురువారం కీలక ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు.

మిగతా సభ్యులు వీరే..

జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే సారథ్యంలోని కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ ఓపీ భట్‌, జస్టిస్ జేపీ దేవదత్‌ తో పాటు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కేవీ కామత్‌, సోమశేఖరన్‌ సుందరేశన్‌ను సభ్యులుగా నియమించింది. కాగా, అదానీ వ్యవహారంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుతం విచారణ సాగిస్తోంది. దీనిని రెండు నెలల్లో పూర్తి చేసి సీల్డ్‌ కవర్లో నివేదిక సమర్పించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. సీల్డ్ కవర్ ప్రతిపాదనల తిరస్కరణ అదానీ-హిండెన్ బర్గ్ విషయంలో గతంలో కేంద్రం సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలను పంపింది. అయితే, వీటిని తాము ఒప్పుకోలేమంటూ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం గతంలో ప్రకటించింది. సీల్డ్ కవర్ ప్రతిపాదనలను తిరస్కరించింది. కేసు విచారణలో పూర్తి పారదర్శకత ఉండాలని.. అందుకే తాము ఇలాంటివి చేపట్టలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో తామే ఒక కమిటీని నియమిస్తామని చెబుతూ తీర్పును అప్పట్లో వాయిదా వేసింది.

కాగా, కేవీ కామత్ అసలు పేరు కుందాపూర్ వామన కామత్. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ చీఫ్ గా, ఇన్ఫోసిస్ చైర్మన్ గా, ఐసీఐసీఐ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గానూ పనిచేశారు. నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు గానే కాక ఆధార్ చైర్మన్ గా సుపరిచితులు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన ప్రముఖుల్లో ఒకరు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.