Begin typing your search above and press return to search.

ఖాళీ అయ్యే ఏపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు వీరేనా?

By:  Tupaki Desk   |   29 April 2022 4:54 AM GMT
ఖాళీ అయ్యే ఏపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు వీరేనా?
X
రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ జూన్ లో ముగిసే పదవీకాలంతో ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నాలుగు స్థానాలు ఏపీ అధికారపక్షం వైసీపీకే దక్కనున్నాయి. నామినేట్ రూపంలో కేటాయించే ఈ పదవుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ఫైనల్ మాటగా చెప్పాలి. ఆయన ఎవరిని డిసైడ్ చేస్తే వారే రాజ్యసభ సభ్యులు.

ఇదిలా ఉంటే.. ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు సంబంధించి మూడు స్థానాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి.. పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వటం ఖాయమంటున్నారు. అదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త.. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి అదానీకి ఒక స్థానాన్ని జగన్ కేటాయించినట్లు చెబుతున్నారు. ఇక.. న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

ఇక.. నాలుగో స్థానం విషయంలో మాత్రం జగన్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ స్థానానికి పోటీ ఎక్కువగా ఉండటం.. పదవిని ఆశించే వారంతా ఆయనకు సన్నిహితులుగా ఉండటంతో నాలుగో స్థానం విషయంలో ఆయన తర్జనభర్జన పడుతున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగో సీటును దళితులకు కానీ మైనార్టీలకు కానీ కేటాయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు.

ఉన్న నాలుగు స్థానాల్లో ఒకటి రాష్ట్రానికి ఏ మాత్ర సంబంధం లేని పారిశ్రామికవేత్త సతీమణికి అప్పజెప్పటం తెలిసిందే. రెండు స్థానాల్ని తనకు వ్యక్తిగతంగా దగ్గరైన వారికి కేటాయించటం.. వారిద్దరూ రెడ్డి సామాజిక వర్గానిక చెందిన వారుకావటంతో నాలుగో స్థానాన్ని దళితులకు ఇవ్వటం సముచితంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఆ దిశగా జగన్ ఆలోచిస్తే ఆయన ముందున్న ఆప్షన్లు తక్కువగా ఉన్నాయని చెప్పాలి.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ.. నాలుగో స్థానం కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారెవరూ దళితులు కాకపోవటంతో.. ఒత్తిడికి తలొగ్గి తన సన్నిహితులకు ఇస్తారా? లేదంటే తాను అనుకున్నట్లుగా కచ్ఛితంగా దళితవర్గానికి చెందిన వారికి కేటాయిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

నాలుగో రాజ్యసభ స్థానం కోసం జగన్ కు అత్యంత సన్నిహితులైన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మేకపాటి రాజమోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు జగన్ కు సన్నిహితులైన వారే.. ఏదో ఒక కీలకస్థానంలో ఉన్న వారే. ఈ విషయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటికి ఎలాంటి పదవి లేదు. ఇప్పటికే కొడుకును పోగొట్టుకొని పుట్టెడు దంఖంలో ఉన్న ఆయనకు సీటు కేటాయిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. బయటకువచ్చిన అంచనా ఇలా ఉంటే.. జగన్ ఆలోచన మరెలా ఉంటుందో ఆయన అధికారిక ప్రకటనతో తేలనుంది.