Begin typing your search above and press return to search.

ప్రపంచకప్: సెమీస్ రేసులో ఎవరెవరు?

By:  Tupaki Desk   |   1 July 2019 5:56 AM GMT
ప్రపంచకప్: సెమీస్ రేసులో ఎవరెవరు?
X
ప్రపంచకప్ రేసు రసవత్తరంగా మారింది. సెమీస్ చేరే నాలుగు జట్లలో మూడు జట్లకు ఇప్పటికే స్థానం ఖాయం కాగా.. నాలుగో జట్టు రేసులో మూడు దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో ఆ జట్టు ఏదనేది ఆసక్తి గా మారింది.

ప్రపంచకప్ లో నెలరోజులు ముగిశాక మూడు జట్లు టాప్ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా 14 పాయింట్లతో సెమీస్ లో చేరగా.. ఆ తర్వాత భారత్ 11 పాయింట్లు, న్యూజిల్యాండ్ 11 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక నాలుగో స్థానానికి ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు పోటీపడుతున్నాయి.

నిన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్ కు చావోరేవో. అందుకే సత్తా చాటింది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత్ కు సర్వశక్తులు ఒడ్డి అపజయాన్ని రుచిచూపించింది. ఓడిపోతే సెమీస్ రేసు నుంచి నిష్ట్రమించాల్సిన క్లిష్ట స్థితిలో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 10పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఐదోస్థానానికి పడిపోయింది.

అయితే ఇప్పుడు ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు సెమీస్ చేరే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ తో.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ తో తలపడుతాయి. న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ గెలిస్తేనే సెమీస్ చేరుతుంది. ఇది ఇంగ్లండ్ కు చావో రేవో మ్యాచ్. ప్రస్తుతం ఇంగ్లండ్ కు 10 పాయింట్లు ఉన్నాయి. ఓడితే 10 పాయింట్లతో సెమీస్ రేసు నుంచి నిష్ట్రమిస్తుంది.గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్ చేరుతుంది.

ఇక పాకిస్తాన్ ప్రస్తుతం 9 పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే 11 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అయితే ఇంగ్లండ్ దేశం న్యూజిల్యాండ్ చేతిలో ఓడితేనే పాక్ కు అవకాశాలు ఉంటాయి.

ఇక బంగ్లాదేశ్ తన రాబోయే రెండు మ్యాచ్ ల్లోనూ గెలవాలి. భారత్, పాకిస్తాన్ లతో బంగ్ల తలపడాలి. ప్రస్తుతం 7 పాయింట్లతో ఉన్న బంగ్లా రెండు మ్యాచ్ లు గెలిస్తే 11 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అయితే న్యూజిల్యాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడితేనే బంగ్లాకు చాన్స్.

అందుకే ప్రపంచకప్ సమరం మొత్తం ఇంగ్లండ్ గెలుపోటమిపై ఆధారపడి ఉంది. ఈనెల 3న బుధవారం ఇంగ్లండ్-న్యూజిల్యాండ్ మ్యాచే ఈ ప్రపంచకప్ సెమీస్ రేసును డిసైడ్ చేస్తుంది. ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. పాకిస్తాన్, బంగ్లా ఇంటికి చేరుతాయి. అదే ఇంగ్లండ్ ఓడితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఒక టీం సెమీస్ చేరుతుంది. దీంతో సెమీస్ రేసులో ఇప్పుడు ఇంగ్లండ్ గెలుపే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంది.