Begin typing your search above and press return to search.

చైనా కరోనా వ్యాక్సిన్ కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి

By:  Tupaki Desk   |   2 Jun 2021 5:30 AM GMT
చైనా కరోనా వ్యాక్సిన్ కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి
X
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నాశనం చేసేసింది. కరోనా దెబ్బకి చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కోట్లమంది కరోనా భారిన పడ్డారు. అయితే , కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం..వ్యాక్సినేషన్. దీనితో శరవేగంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే పలు దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లకి డబ్ల్యూహెచ్ ఓ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ తరుణంలోనే తాజాగా డబ్ల్యూహెచ్ ఓ చైనా వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏళ్లు పై బడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని ప్రకటించింది. చైనా తయారు చేసిన సినోవాక్ వ్యాక్సిన్ కూడా రెండు డోస్ లుగా ఇవ్వాల్సి ఉంటుంది.

తొలి డోసు అనంతరం 2 నుంచి 4 వారాలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ పేర్కొంది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. చైనాలో దీన్ని ఉపయోగిస్తున్నారు. తాజాగా, డబ్ల్యూహెచ్ ఓ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇతర దేశాల్లోనూ సినోవాక్ వినియోగానికి మార్గం సుగమం అయింది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ ఓ అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యాచరణ కొవాక్స్ లోనూ సినోవాక్ కు స్థానం దక్కనుంది. కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో, పలు పేద దేశాల్లో వ్యాక్సిన్ కొరతను సినోవాక్ తీర్చనుందని భావిస్తున్నారు. భారత్ లో మాత్రం కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. రష్యా నుండి వచ్చిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా త్వరలో ఇక్కడ అందుబాటులోకిరాబోతోంది.