Begin typing your search above and press return to search.

అతి తక్కువ ఖర్చుతో ఎంపీ ఎన్నికల్ని పూర్తి చేసిన పార్టీ ఏదంటే?

By:  Tupaki Desk   |   3 July 2021 9:30 AM GMT
అతి తక్కువ ఖర్చుతో ఎంపీ ఎన్నికల్ని పూర్తి చేసిన పార్టీ ఏదంటే?
X
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా తక్కువగా ఖర్చు చేసిన పార్టీగా ఏపీ అధికారపక్షం వైసీపీకి గుర్తింపు లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన దాని కంటే తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసిన లెక్కల్ని మదింపు చేసిన ఎలక్షన్ వాచ్.. ఎడీఆర్ సంస్థ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీలకు సంబంధించిన అఫిడవిట్ లకు గాను 538 మంది అఫిడవిట్ లలో పొందుపర్చిన ఖర్చు లెక్కల్ని ఈ సంస్థ అధ్యయనం చేసింది.

అదే సమయంలో ఖర్చు లెక్కల్ని ప్రకటించిన ఐదుగురు ఎంపీల వివరాలు తమకు లభించలేదని సదరు సంస్థ చెప్పింది. ఆ ఐదుగురు ఎంపీల్లో ఇద్దరు తెలుగు వారు కావటం గమనార్హం. ఆ ఇద్దరు మరెవరో కాదు.. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి.. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజులుగా పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన మొత్తంతో పోలిస్తే.. అతి తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన ఎంపీల్లో వైసీపీకి చెందిన గొడ్డేటి మాధవి నిలిచారు. ఆమె కేవలం రూ.14.12 లక్షలు మాత్రమే ఖర్చుచేశారు.

తర్వాతి స్థానంలో వైసీపీఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రూ.15.06 లక్షలు ఖర్చు చేయగా.. బెల్లాన చంద్రశేఖర్ రూ.15.83 లక్షలు.. చింతా అనురాధ రూ.16.74 లక్షలు.. భీశెట్టి వెంకట సత్యవతి రూ.17.66 లక్షలు ఖర్చు చేసినట్లుగా ప్రకటించారు. అదే సమయంలో దేశంలో అత్యధికంగా ఖర్చు పెట్టిన ఎంపీగా అనంతనాగ్ (జమ్ముకశ్మీర్) ఎంపీగా తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా హస్నైన్‌ మసూది (జేకే నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ) రూ.79.27 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన బీజేపీ ఎంపీ రవికిషన్ రూ.77.95లక్షలు ఖర్చు చేసినట్లుగా తేల్చారు.

ఎంపీ ఎన్నికల్లో ఖర్చు అధికంగా పెట్టిన పార్టీల విషయానికి వస్తే శివసేన మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీ 18 మంది ఎంపీలకు సరాసరిన రూ.59.26 లక్షలు ఖర్చు చేయగా.. రెండో స్థానంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ నిలిచింది. ఆ పార్టీ తన తొమ్మిది మంది ఎంపీలకు సంబంధించి సరాసరి ఖర్చు రూ.57.85 లక్షలుగా తేల్చారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తన వ్యక్తిగత డబ్బులు రూ.28,500 ఖర్చు చేయగా.. పార్టీ విరాళంగా రూ.49.99లక్షలు అందినట్లుగా గుర్తించారు.

ఎంపీల సరాసరి ఖర్చు విషయానికి వచ్చినప్పుడు.. రాష్ట్రాల వారీగా చూస్తే.. త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి ఎంపికైన ఎంపీ సరాసరి ఖర్చు రూ.65.69గా తేల్చారు. తర్వాతి స్థానంలో కేరళ నిలవగా.. మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. రెండు తెలుగురాష్ట్రాలు 19.. 26 స్థానాల్లో నిలిచాయి. 19వ స్థానంలో తెలంగాణ నిలిస్తే.. 26వ స్థానంలో ఏపీ నిలవటం గమనార్హం. పార్టీల వారీగా ఎంపీల సరాసరి ఎన్నికల ఖర్చు విషయంలోకి వెళితే.. శివసేన.. టీఆర్ఎస్.. జూడీయూలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అతి తక్కువ ఖర్చుచేసిన పార్టీగా వైసీపీ నిలిచింది. టీడీపీ విషయానికి వస్తే. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు సరాసరిన రూ.49.31 లక్షలు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు.