Begin typing your search above and press return to search.

సాగర్ లో గెలిపించేదీ.. ఓడగొట్టేదీ ఆ రెండు పార్టీలేనా?

By:  Tupaki Desk   |   8 April 2021 9:30 AM GMT
సాగర్ లో గెలిపించేదీ.. ఓడగొట్టేదీ ఆ రెండు పార్టీలేనా?
X
నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక పోరు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిచిన‌ప్ప‌టికీ.. అవి ఒక వ‌ర్గానికి సంబంధించిన ఓట్లు మాత్ర‌మే అనే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో.. సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారా త‌మ‌ స‌త్తా త‌గ్గ‌లేద‌ని, బీజేపీ గెలుపు గాలివాట‌మేన‌ని చాటిచెప్పాల‌ని గులాబీద‌ళం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అటు జానారెడ్డి ఇలాఖాగా భావించే చోట గెలిచి పూర్వ వైభ‌వానికి బాట‌లు వేసుకోవాల‌ని కాంగ్రెస్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది.

బీజేపీ నాయ‌కులు ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికీ.. పోరుమాత్రం కాంగ్రెస్ - టీఆర్ఎస్ మ‌ధ్య‌నే అని అంటున్నారు స్థానికులు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ పోరు ఎలా సాగిందో.. సాగ‌ర్ లోనూ టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టుగా ఉంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రు గెలిచినా 4 నుంచి 5 వేల ఓట్ల మెజారిటీ మాత్ర‌మే వ‌స్తుంద‌ని అంటున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు మండ‌లాలు టీఆరెస్ కు, మూడు మండ‌లాలు కాంగ్రెస్ కు ఎడ్జ్ చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో మునిసిపాలిటీ ఓట‌ర్లే కీల‌కంగా మార‌బోతున్నార‌ని స‌మాచారం. ఎంత ప్ర‌య‌త్నించినా.. మునిసిప‌ల్ ఓట‌రు నాడి ఏంట‌నేది ఎవ్వ‌రూ ప‌సిగ‌ట్టలేక‌పోతున్నార‌ట‌. వీరి ఓట్లు కీల‌కంగా మార‌బోతున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు. ఈ ఎన్నిక‌లో బీజేపీ పోరు నామ‌మాత్ర‌మేన‌ని తేల్చేస్తున్నారు.

ఎన్నిక‌కు ఇంకా వారం పైనే ఉంది. ఈ లోగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ఈ రెండు పార్టీలూ ప్ర‌య‌త్నిస్తున్నాయి. జానారెడ్డి అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తూ ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేశారు. అయితే.. కాంగ్రెస్ లోని యూత్ మాత్రం.. త్వ‌రలో జ‌ర‌గ‌నున్న రేవంత్ రెడ్డి స‌భ‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు స‌మాచారం. ఇటు గులాబీ కేడ‌ర్ కేసీఆర్ స‌భ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డ మ‌రో కీల‌క‌మైన విష‌య‌మై చ‌ర్చ జ‌రుగుతోంది.

నాగార్జున సాగ‌ర్ బ‌రిలో DSP, MSP అనే ద‌ళిత వ‌ర్గానికి సంబంధించిన రెండు పార్టీలో బ‌రిలో నిలిచాయి. ఆ రెండు పార్టీల‌కు క‌నీసం 2 నుంచి 4 వేల ఓట్ల వ‌ర‌కు చీల్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ఈ పార్టీలు చీల్చ‌బోతున్న ఓట్లు ఎవ‌రివి? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. కాంగ్రెస్ - టీఆర్ఎస్ మ‌ధ్య నువ్వా నేనా? అన్న‌ట్టుగా సాగుతున్న పోరులో ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. అందునా.. ఎవ‌రు గెఇచినా నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే అంటున్న ప‌రిస్థితి. ఇలాంటి సంద‌ర్భంలో ఆ రెండు పార్టీలు ఎవ‌రి ఓట్లు చీల్చుతాయోన‌ని కాంగ్రెస్‌, గులాబీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇక‌, బీజేపీ అభ్య‌ర్థి చీల్చే ఓట్ల గురించి కూడా చ‌ర్చిస్తున్నారు. ఆ పార్టీ తండాల్లో ప‌దివేల క‌న్నా ఎక్కువ‌ ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ కు ఇబ్బంది వ‌స్తుంద‌ని, ప‌దివేల క‌న్నా త‌క్కువ ఓట్లు చీలిస్తే టీఆర్ఎస్ కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అయితే.. బీజేపీకి సంప్ర‌దాయ ఓటింగ్ ఉంటుంది కాబ‌ట్టి.. ఆ లెక్క‌లన్నీ వేసుకున్న కాంగ్రెస్‌, టీఆర్ఎస్ నేత‌లు.. DSP, MSP చీల్చబోయే ఓట్ల గురించే భ‌య‌ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు పార్టీలు కొర‌క‌రాని కొయ్య‌గా మారాయ‌ని అంటున్నారు. మ‌రి, వాళ్లు ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఎవ‌రికి గండికొడ‌తారు? అన్న‌ది చూడాలి.