Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే పూర్తి శాఖాహార నగరం ఎక్కడ ఉంది? దీని స్పెషాలిటీ ఏంటి?

By:  Tupaki Desk   |   27 Nov 2022 3:30 AM GMT
ప్రపంచంలోనే పూర్తి శాఖాహార నగరం ఎక్కడ ఉంది? దీని స్పెషాలిటీ ఏంటి?
X
పురాతన కాలం నుంచి కొన్ని నగరాలు తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాలకు యూనెస్కో నుంచి అరుదైన గుర్తింపు లభించింది. భారత్ లోనూ ఇలాంటివి అనేకం ఉన్నాయి. అందమైన ప్రకృతి ఆలయాలు.. ఎన్నో రహస్య ప్రదేశాలు మనదేశంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి.

అయితే కొన్నింటికి సరైన గుర్తింపు రాకపోవడంతో పలు ఆలయాలు.. నగరాల చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలియకపోవడం శోచనీయంగా మారింది. కాగా మనం ఇప్పుడు చెప్పుకునే నగరం ప్రపంచంలోనే అన్ని నగరాల కంటే చాలా స్పెషల్. ఈ నగరం ప్రపంచంలోనే పూర్తి శాఖాహార ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది మన భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలోనే ఉండటం విశేషం.

ఈ శాఖాహారం నగరం స్టోరీ విషయానికొస్తే.. గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో పాటిలానా నగరం ఉంది. జైన మతస్థులకు పవిత్ర పుణ్య క్షేత్రంగా పాటిలానా విరాజిల్లుతోంది. సుమారు తొమ్మిది వందల కంటే ఎక్కువ దేవాలయాలున్న ఏకైక పర్వతంగానూ.. ఎంతో అందమైన ప్రదేశంగానూ పాటిలానా సందర్శకులచే కీర్తించబడుతోంది.

పాటాలానాలో జంతు బలులు నిషేధం. ఎవరైనా ఈ ప్రాంతంలో జంతువులను చంపితే చట్టపరంగా శిక్షార్హులవుతారు. ఇక ఈ ప్రాంతంలో జైనుల పంచ క్షేత్రాల్లో ఒకటి అయిన శత్రుంజన ఆలయం ఉంది. ఈ పర్వతంలోని శత్రుంజన ఆలయాన్ని చేరుకోవాలంటే సందర్శకులు సుమారు 3వేల 950 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

పాటాలానాలో అందమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. శత్రుంజన కొండ.. శ్రీ విశాల్ జైన్ మ్యూజియం.. హస్తగిరి జైన తీర్థం.. గోపి నాత్ బీచ్ వంటి ప్రాంతాలు సందర్శకులకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం. ఇక ఇక్కడి వెళ్లేందుకు రోడ్డు రవాణా.. విమానం.. రైలు సర్వీసులు ఉన్నాయి.

విమానంలో వెళ్లాలనుకునే పర్యాటకులు సమీపంలోని భావ్ నగర్ విమానశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి టాక్సీ.. బస్సు వంటి సదుపాయాలతో పాటాలానా వెళ్లొచ్చు. రైలు మార్గంలో అయితే అహ్మదాబాద్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి భావ్ నగర్ 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే సూరత్.. అహ్మదాబాద్ మీదుగా భావ్ నగర్ కు బస్సులో ప్రయాణించవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.