Begin typing your search above and press return to search.

ష‌ర్మిల ఓటు ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   3 Feb 2022 6:49 AM GMT
ష‌ర్మిల ఓటు ఎక్క‌డ‌?
X
రాజ‌న్య రాజ్యం తేవ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరుతో ష‌ర్మిల పార్టీ పెట్టారు. గ‌తేడాది జులై 8న త‌న తండ్రి జ‌యంతి పుర‌స్క‌రించుకుని వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ప్ర‌క‌టించారు. అక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. ఆ త‌ర్వాత పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె నానా తంటాలు ప‌డుతున్నారు. అనుకున్న మైలేజీ రాక‌పోవ‌డం.. రాజ‌కీయాల్లో త‌న‌ను ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోవ‌డంతో ఆమె ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌మ పార్టీని అస‌లు లెక్క చేయ‌డం లేదు.. ఇక మీడియా, ప్ర‌జ‌లు కూడా ఆమె గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌.

త‌న అన్న ఏపీ సీఎం జ‌గ‌న్‌పై అలిగి ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టార‌నే అభిప్రాయాలున్నాయి. త‌న అన్న అధికారంలోకి రావ‌డానికి కృషి చేసిన ఆమెను జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌ట్టించుకోలేద‌ని అందుకే ష‌ర్మిల తెలంగాణ‌లో వేరు కుంప‌టి పెట్టార‌ని అంటున్నారు. తెలంగాణ కోడ‌లు కాబ‌ట్టి త‌న‌కు ఇక్క‌డ హ‌క్కు ఉంటుంద‌ని ష‌ర్మిల మొద‌టి నుంచి చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

నిరుద్యోగ స‌మ‌స్య‌ను భుజాల‌కెత్తుకుని దీక్ష‌లు చేప‌ట్టారు. పాద‌యాత్ర కూడా చేశారు. ఇప్పుడు రైతు స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాడుతున్నారు. కానీ త‌న పార్టీకి త‌గిన మైలేజీ మాత్రం రావ‌డం లేదు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కంటే కూడా కేసీఆర్‌ను ష‌ర్మిల తిడుతున్న‌ప్ప‌టికీ ఆశించిన ప్రయోజ‌నం మాత్రం క‌ల‌గ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

మీడియా నుంచి ష‌ర్మిల‌కు ఆశించిన మ‌ద్ద‌తు రావ‌డం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. అదేమంటే.. అసలు ష‌ర్మిల‌కు తెలంగాణ‌లో ఓటు హ‌క్కు ఉందా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయని తెలిసింది. ఆమెకు ఓటు హ‌క్కు ఎక్క‌డ ఉందో త‌మ‌కు తెలీద‌ని అలాంటిది తెలంగాణ‌లో ఆమె ఏ రాజ‌కీయాలు చేస్తుంద‌ని తెలంగాణ వాదులు అంటున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే దివంగ‌త సీఎం వైఎస్సార్‌పై తెలంగాణ వ్య‌తిరేకి అనే ముద్ర ఉంది. దీంతో ష‌ర్మిల‌ను కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు అదే దృష్టితో చూసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇన్నేళ్ల‌లో లేనిది ఇప్పుడు ఇక్క‌డ‌కు వ‌చ్చి నేను తెలంగాణ కోడ‌లిని అంటే ప్ర‌జ‌లు మాత్రం ఎలా విశ్వ‌సిస్తార‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి సొంత పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు ఎటు చూసినా స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి.