Begin typing your search above and press return to search.

షర్మిల ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పార్టీ ఆవిర్భావం ఎలా జరగనుంది?

By:  Tupaki Desk   |   5 July 2021 9:41 AM GMT
షర్మిల ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పార్టీ ఆవిర్భావం ఎలా జరగనుంది?
X
అనూహ్య నిర్ణయంతో తెలంగాణలో ప్రత్యేకంగా పార్టీ పెట్టాలని నిర్ణయించి అందరిని షాక్ తో కూడిన సర్ ప్రైజ్ కు గురి చేశారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కుమార్తె వైఎస్ షర్మిల. జగనన్న విడిచిన బాణంగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఆమె.. తన పొలిటికల్ కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయం.. ఆమె కుటుంబానికి ఏ మాత్రం సరిపడని మీడియా సంస్థలో తొలిసారి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కావాలనే టార్గెట్ చేశారన్న మాటతో పాటు.. మరీ ఇంత దారుణమైన విశ్లేషణ అంటూ వ్యాఖ్యానించిన వారు లేకపోలేదు. గాలిని పోగేసినట్లుగా రాతలు రాశారని మండిపడిన వారు లేకపోలేదు.

ఊహకు కూడా సాధ్యం కాని రీతిలో కథనం అల్లారని అని చెప్పినా.. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే విషయం షర్మిల పొలిటికల్ పార్టీ ఏర్పాటుతో మరోసారి స్పష్టమైంది. తొలుత అనుకున్నట్లుగా పార్టీని వేగంగా ఏర్పాటు చేయాలని భావించినా.. కరోనాతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. మరో రెండు రోజుల్లో (బుధవారం) హైదరాబాద్ లోని ఫిలింనగర్ లోని జెఆర్సీ కన్వెష్షన్ సెంటర్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.

పార్టీకి సంబంధించిన పేరుతో పాటు జెండాను.. ఎజెండాను దశల వారీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు వైఎస్ జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రంగుల్లో ప్రధానమైన నీలం రంగును షర్మిల కూడా తీసుకోవటం గమనార్హం. పార్టీ జెండా తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో ఉంటుందని ఇప్పటికే హింట్ ఇవ్వటం తెలిసిందే. పార్టీ జెండా.. ఎజెండా మొత్తం తెలంగాణ భావోద్వేగాలకు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన భారీ కసరత్తు ఇప్పటికే పూర్తైంది.

ఇదిలా ఉంటే.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ సిద్ధం చేశారు. ప్రస్తుతం షర్మిల బెంగళూరులోని తన నివాసంలో ఉన్నారు. ఈ కారణంతోనే పార్టీ కార్యక్రమాల్ని ఈ మధ్యన పార్టీ నేతలే పూర్తి చేస్తున్నారు. ఇక.. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన జులై 8న ఆమె.. భారీ షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆ ఒక్కరోజులోనే ఆమె మూడు రాష్ట్రాల్లో తిరగాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో షర్మిల నివాసం నుంచి ఆమె బుధవారం ఉదయం బయలుదేరనున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఆమె ఏపీలోని కడప జిల్లాలోని తన తండ్రి సమాధి ఉన్న ఇడుపుల పాయకు చేరుకోనున్నారు.

అక్కడ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చేరుకొని ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఆమె కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన చాపర్ లో మధ్యాహ్నం రెండు గంటల వేళకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాల వేయనున్నారు.

అనంతరం ఆమె సాయంత్రం నాలుగు గంటల వేళలో ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్నారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటల సమయంలో పార్టీ ఆవిర్భావ ప్రకటనను చేయనున్నారు. ఇదంతా బాగుంది కానీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ.. పార్టీ అధినేత మూడు రాష్ట్రాల్లో పర్యటించాల్సిన నేపథ్యంలో.. ఏ చిన్న సాంకేతిక లోపం తలెత్తినా పార్టీ నేతలకు టెన్షన్ పుట్టటం ఖాయమని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.