Begin typing your search above and press return to search.

'మహా’ బలపరీక్షకు ఓకే చెబుతూ సుప్రీం తీర్పు వేళలో.. ఫడ్నవీస్ ఎక్కడున్నారు?

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:03 AM GMT
మహా’ బలపరీక్షకు ఓకే చెబుతూ సుప్రీం తీర్పు వేళలో.. ఫడ్నవీస్ ఎక్కడున్నారు?
X
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల పుణ్యమా అని.. మహా సంక్షోభం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్దవ్ సర్కారును బలపరీక్షను ఎదుర్కోవాలని.. గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు ఈ ప్రక్రియ ముగియాలంటూ గవర్నర్ లేఖ రాయటం..

దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. సుప్రీం సైతం బలపరీక్షను చేపట్టాలన్న తీర్పును ఇవ్వటంతో.. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి.. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి.. బీజేపీ నేత.. మోడీ శిష్యుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్కడ ఉన్నారు? ఆయనేం చేస్తున్నారు? అన్న విషయాలు ఆసక్తికరమని చెప్పాలి.

సుప్రీం తీర్పు సమయానికి ముంబయిలోని తాజ్ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఫడ్నవీస్ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి తాజ్ వేదిక కాగా.. ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు బలపరీక్షకు అనుకూలంగా నిర్ణయం వెలువడటంతో ఆనందంతో హర్షధ్వానాలు చేశారు.

అంతేకాదు.. సుప్రీం తీర్పునకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున.. 'హమారా ముఖ్యమంత్రి కైసా హో.. దేవేంద్ర ఫడ్నవీస్ జైసా హో' అంటూ నినాదాల్ని చేయటం గమనార్హం. ఒకప్పుడు సాదాసీదాగా.. ఆడంబరాలకు దూరంగా ఉండే బీజేపీ.. మోడీ హయాంలో తన రూపురేఖల్ని పూర్తిగా మార్చుకుందని చెప్పాలి.

గతానికి భిన్నంగా బీజేపీ ఇప్పుడు ఫైవ్ స్టార్ రాజకీయాల్ని నిర్వహిస్తోంది. పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని తాజ్ హోటల్లో నిర్వహించటమే కాదు.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రీతిలో అయితే ప్రభుత్వాల్ని కూల్చేదో.. ఇప్పుడు అదే పద్దతిని కమలనాథులు ఫాలో కావటం గమనార్హం. ఏమైనా.. బీజేపీ ఎలా మారిందనటానికి తాజా పరిణామాలే నిదర్శనమని చెప్పక తప్పదు.