Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ‌? నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు..

By:  Tupaki Desk   |   11 Nov 2021 2:30 AM GMT
రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ‌?  నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు..
X
చిత్తూరు జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోని కుప్పం మునిసిపాలిటీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నాయ‌కులు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. అక్క‌డ గూండా రాజ్ అమ‌ల‌వుతోంద‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఇక్క‌డ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు త‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ.. ఆయ‌న రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ గౌతం సవాంగ్ లకు లేఖ రాశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని దుయ్య‌బ‌ట్టారు.
ఇప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ అధికార పార్టీ నేత‌ల దూకుడు పెరిగింద‌ని ఆరోపించారు.

అధికార వైసీపీతో అధికారులు కుమ్మక్కై టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా అడ్డుకుంటున్నారని చంద్ర‌బాబు ఆరోపించారు. స్థానిక ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని పేర్కొన్నారు. నకిలీ సంతకాలతో నామినేషన్లను తొలగించారని వివ‌రించారు. అధికార వైసీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులతో అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని చంద్ర‌బాబు తెలిపారు. మంగ‌ళ‌వారం అర్ధరాత్రి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అమరనాథ్ రెడ్డితో సహా తిరుపతి పార్లమెంటరీ టీడీపీ ఇంచార్జి పుల్లివర్తి నాని లను అరెస్ట్ చేశారని.. ఇది భావ్య‌మేనా? అని ప్ర‌శ్నించారు.

సోమ‌వారం తప్పుడు కేసు నమోదు చేసి 9వ తేదిన అర్థరాత్రి అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసులకు అందుబాటులో ఉండగా అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్ర‌శ్నించారు. ఇది టీడీపీ నేతలను ఎన్నికల్లో ప్రచారం చేయనీకుండా అడ్డుకునేందుకు అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నం తప్ప‌ మరొకటి కాదన్నారు. జరుగుతున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. బ్రిటీష్ రాజ్, నియంతృత్వ అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయని నిప్పులు చెరిగారు. మ‌రి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.