Begin typing your search above and press return to search.

ట్విస్టు చేయటం లేదు.. ఈ మాట అన్నది అసదే..‘బీజేపీకి ఓటేయండి’

By:  Tupaki Desk   |   29 Nov 2020 4:00 PM GMT
ట్విస్టు చేయటం లేదు.. ఈ మాట అన్నది అసదే..‘బీజేపీకి ఓటేయండి’
X
విన్నంతనే నమ్మరు. కానీ.. ఇది నిజం. మజ్లిస్ అధినేత నోట బీజేపీకి ఓటు వేయమని చెప్పటమా? ఇదేమైనా కొత్త కుట్ర? లేక.. ప్లానింగా? అన్న సందేహాలు అక్కర్లేదు. బీజేపీ అంటే చాలు ఒంటికాలు మీద లేచే అసద్ లాంటి రాజకీయ నేత.. ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పటం సాధ్యమా? అంటే.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. అదెలానంటే.. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగటం తెలిసిందే. ఒక పార్టీకి మించి మరో పార్టీ ప్రచారం చేస్తోంది.

ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి పాతబస్తీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఝూన్సీ బజార్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభకు మార్వాడీలు.. బెంగాలీలతో పాటు వ్యాపార వర్గాలు అధికంగా ఉండే వర్గాలు వచ్చాయి. ఈ సందర్భంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘మీరు ఇంతకాలం మాకు దూరంగా ఉన్నారు. మా దగ్గరికి రండి. మనమంతా కలిసి ఈ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయండి. కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక అంశాల్ని ప్రామాణికంగా చేసుకొని మాకు ఓటు వేయండి’’ అని పేర్కొన్నారు.

బల్దియా ఎన్నికల ప్రచారానికి దేశ వ్యాప్తంగా పలువురు నేతలు వస్తున్నారని.. మిగిలింది ఒక్క అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా అసద్ నోటి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు స్థానిక ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.