Begin typing your search above and press return to search.

ఢిల్లీ తగలబడుతుంటే హోంమంత్రి అమిత్ షా ఏంచేస్తున్నారు?

By:  Tupaki Desk   |   28 Feb 2020 9:00 AM GMT
ఢిల్లీ తగలబడుతుంటే హోంమంత్రి అమిత్ షా ఏంచేస్తున్నారు?
X
సీఏఏ కి నిరసనగా ఢిల్లీ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఇప్పటికే 38 మంది ప్రాణాలు విడిచారు. కేంద్రం ఈ చట్టాన్ని తీసుకోని వస్తున్నాం అని ప్రకటించిన నాటి నుండి దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఈ ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే ధోరణిలో ఆలోచించడం లేదు అని శివసేన కేంద్ర ప్రభుత్వం పై మండిపడింది. ఢిల్లీ నగరం తగలపడిపోతోంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్కడున్నారని ప్రశ్నించింది. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని అమిత్ షా మాత్రం కనిపించడం లేదని , అమిత్ షా ఎక్కడున్నారంటూ ప్రతి ఒక్కరి నోటా ఇదే ప్రశ్న వినిపిస్తోందని శివసేన మాతృపత్రిక సామ్నాలో ఈ కథనం ప్రచురితమైంది.

ఢిల్లీ విధుల్లో అల్లర్లు జరుగుతుంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజలను కలిశారు కానీ.. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పాంప్లేట్లు పంచిన కేంద్ర మంత్రి అమిత్ షా, ఇప్పుడు అదే ఢిల్లీ కాలిపోతుంటే ప్రజలకు ఎందకు కనిపించరని సామ్నా ద్వారా శివసేన ప్రశ్నించింది. ఓ వైపు ఢిల్లీలో అమాయకులు మృతి చెందుతుంటే మోడీ, మోడీ కేబినెట్‌ లోని మంత్రులు అహ్మదాబాదులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు వంగి వంగి దండాలు పెడుతున్నారంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించింది. జాతీయ భావం మతతత్వంలతో దేశం 100 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు చేసింది శివసేన.

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ప్రశ్నిస్తే దేశద్రోహి కింద ముద్ర వేస్తున్నారని అదే బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మాత్రం అవి కనిపించడం లేదని దుయ్యబట్టింది శివసేన పార్టీ. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేష్ మిశ్రా, కపిల్ మిశ్రాలు చేసిన ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమన్నందుకు జడ్జీనే బదిలీ చేస్తారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది శివసేన పార్టీ. జస్టిస్ మురళీధర్ చెప్పినదాంట్లో తప్పేముందని ప్రశ్నించింది. ఇక ప్రతిపక్షాలు కూడా సరైన పాత్ర పోషించడంలో విఫలమయ్యాయని శివసేన మండిపడింది. ఒకవేళ ప్రతిపక్షంలో బీజేపీ కనుక ఉన్నట్లైతే ఇప్పటికే ..హోంమంత్రి రాజీనామా కి డిమాండ్ చేసేది అని శివసేన తెలిపింది. కానీ , ప్రస్తుత ప్రతిపక్షం లో సరైన సంఖ్యాబలం లేక ఏమి చేయలేకపోతున్నారు అని తెలిపింది.