Begin typing your search above and press return to search.

వారం పాటు రాజు ఎక్కడెక్కడ తిరిగాడు? ఏమేం చేశాడు?

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:31 AM GMT
వారం పాటు రాజు ఎక్కడెక్కడ తిరిగాడు? ఏమేం చేశాడు?
X
పెను సంచలనంగా మారిన సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఉదంతంలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేసుకునేలా చేశారా? లాంటి సందేహాలు ఒక పక్క.. అతడిది ఆత్మహత్య కాదంటూ హైకోర్టులో పిటీషన్.. మరోవైపు అతడి తల్లి.. భార్యలు చేస్తున్న ఆరోపణల వేళ.. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా పోలీసులు తమ పరిశోధనను కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఐదు రోజులు ఎక్కడెక్కడ తిరిగాడు? ఏయే ప్రాంతాల్లో ఉన్నాడన్న అంశంపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్నారు. హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యతో హత్యాచార ఘటన దర్యాప్తు ప్రక్రియ ముగింపు దశకు చేరకుంది. ఇప్పటికే హత్యాచార ఉదంతానికి సంబంధించిన దర్యాప్తు సాంకేతికంగా ముగిసింది.

అయితే.. రాజు ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలను కోర్టుకు సమర్పించే అభియోగపత్రాల్లో మరిన్ని వివరాలు సేకరించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉప్పల్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ వరకు ఉన్న 133 కిలోమీటర్ల దూరానికి నిందితుడు ఎలా చేరుకున్నాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హత్యాచారం చేసిన అనంతరం నిందితుడు రాజు ఈ నెల 11 వరకు హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లుగా గుర్తించారు.

మలక్ పేట.. సంతోష్ నగర్.. చాంద్రాయణ గుట్ట.. ఫలక్ నుమా.. శాలిబండ.. మొగల్ పురా.. చారిన్మార్ పరిసరాల్లో తిరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు తనను పట్టుకుంటారన్న ఆలోచనతో ఈ నెల 11న ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే బస్సు ఎక్కినట్లుగా కనిపెట్టారు. అయితే.. మార్గ మధ్యలో దిగిన అతను ఎక్కడికి వెళ్లాడన్నది అంతుచిక్కలేదు. అప్పటి నుంచి ఆత్మహత్య చేసుకునే రోజు వరకు నడుచుకుంటూ వెళ్లాలంటే రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున అనుకున్నానాలుగు రోజుల్లో 133 కి.మీ. దూరాన్ని ఎలా చేరుకున్నాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఒక పరిమితి వరకు నడిచి వెళ్లాలన్నా.. అందుకు అవసరమైన శక్తి కావాలి.అందుకు నీళ్లు.. ఆహారం తప్పనిసరి. రోడ్డు మీద అన్ని కిలోమీటర్లు నడిచి వెళుతుంటే.. ఎవరో ఒకరు చూడకుండా ఉండరు. అనుమానించకుండా ఉండరు. దీంతో ఎక్కవ భాగం నడక కంటే కూడా స్థానిక ఆటోల్లో ప్రయాణించి ఉంటారన్న అభిప్రాయానికి వస్తున్నారు. రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే హైదరాబాద్ పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా హైదరాబాద్ నుంచి ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఎలా వెళ్లి ఉంటాడదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.