Begin typing your search above and press return to search.

కరోనా నిబంధనలు షర్మిలకు పట్టవా?

By:  Tupaki Desk   |   16 April 2021 3:30 PM GMT
కరోనా నిబంధనలు షర్మిలకు పట్టవా?
X
కరోనా కల్లోలం దేశంలో చోటుచేసుకుంటోంది. సెకండ్ వేవ్ వచ్చినట్టే కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ ఆస్పత్రి పాలవుతున్నారు. బెడ్స్ ఖాళీగా లేకుండా ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు మాస్కులు, సామాజికదూరం పాటించకపోతే కరోనా ఖచ్చితంగా సోకేంత ప్రమాదం ఉంది. గాలిద్వారానూ వైరస్ వ్యాపిస్తోంది.

అయితే ఇంతటి క్లిష్ట సమయంలో మాస్కులు, సామాజికదూరం పాటించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. సామాన్యులు మాస్కులు ధరించకపోతే రూ.1000 రూపాయిలు ఫైన్ వేసే ప్రభుత్వాలు రాజకీయ నేతలు బహిరంగంగా అలా తిరుగుతున్న ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కరోనా భద్రతా చర్యలు రాజకీయ వర్గాలపై ఎందుకు పనిచేయవని నిలదీస్తున్నారు. రాజకీయ ర్యాలీలు.. సభల్లో కరోనా రక్షణ చర్యలు ఎందుకు పాటించరని ప్రశ్నిస్తున్నారు. సురక్షితమైన సామాజిక దూరం.. మాస్కులు వాడటం వంటి కీలక చర్యలను ఎందుకు పట్టించుకోరు అని ప్రవ్నిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద నిన్న జరిగిన నిరసనలో వైయస్ షర్మిల పూర్తిగా కరోనా నిబంధనలు తుంగలో తొక్కేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వైయస్ షర్మిల, ఆమె తల్లి వైయస్ విజయమ్మ సహా పక్కనే ఉన్న నాయకులు ఎవరూ నిన్న దీక్ష స్థలిలో మాస్కులు ధరించలేదు. వారు ధర్నా సమయంలో సామాజిక దూరాన్ని పాటించలేదు. దీక్షకు మద్దతుగా తరలివచ్చిన పెద్ద సంఖ్యలో షర్మిల మద్దతుదారులు కూడా మాస్కులు ధరించలేదు. అంతే కాదు, వారు కూడా సామాజిక దూరం లేకుండా కూర్చున్నారు.

ఇక షర్మిలకు మద్దతుగా వచ్చి ప్రసంగించిన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, వామపక్ష ఉదారవాద నాయకుడు కంచె ఇలయ్య వంటి ప్రముఖ వక్తలు కూడా మాస్కులు ధరించలేదు. దురదృష్టవశాత్తు, నాయకులు ఒకరికొకరు చాలా దగ్గరగా కూర్చున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కరోనా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇటువంటి సమావేశాలు అనవసరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా హాని కూడా... అయినప్పటికీ, ఎవరూ పట్టించుకోకుండా షర్మిల సభలో కరోనా నిబంధనలు గాలికి వదిలేయడం గమనార్హం. .

కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకే షర్మిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఈ సమయంలో కొంత యాక్షన్ డ్రామా నడిచింది. ఈ సభ ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కనీసం 14 మంది ముఖ్య స్టార్ క్యాంపెయినర్లకు తాజాగా కోవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ వారు అధికార పార్టీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. వైయస్ షర్మిల నిరసన కార్యక్రమంలో ఇదే పరిస్థితి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలానే సాగితే మరింతగా కరోనా విస్తరించడం ఖాయమంటున్నారు.