Begin typing your search above and press return to search.

వైట్ ​హౌస్​ ఎప్పుడు నిర్మించారు? దాని ప్రత్యేకతలు ఇవే..!

By:  Tupaki Desk   |   20 Jan 2021 10:30 AM GMT
వైట్ ​హౌస్​ ఎప్పుడు నిర్మించారు? దాని ప్రత్యేకతలు ఇవే..!
X
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌదం (వైట్​హౌస్​)కు ఎంతో ప్రాధాన్యముంది. ఈ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ భవంతి ఎప్పుడు ఏర్పడింది. దీని ప్రత్యేకత ఏమిటి? ఇంత గొప్ప నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు. తదితర విశేషాలు తెలుసుకుందాం. డొనాల్డ్​ ట్రంప్​ పదవికాలం నిన్నటితో ముగిసింది. ఇవాళ జో బైడెన్​ అధ్యక్షపీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ నేపథ్యంలో వైట్​హౌస్​ చరిత్రను ఓ సారి నెమరువేసుకుందాం.. పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్​ వెస్ట్​ వాషింగ్టన్​ డీసీలో 1792 వ సంవత్సరంలో వైట్​హౌస్​ను నిర్మాణం మొదలైంది. చివరకు అనేక మార్పులు చేయగా.. 1800 సంవత్సరం నాటికి ఓ రూపం సంతరించుకున్నది. దాదాపు 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వైట్​హౌస్​ను నిర్మించారు. అమెరికా అధ్యక్షులు నివసించేందుకే దీన్ని నిర్మించారు.

అయితే మొదట్లో దీని పేరు ప్రెసిడెంట్స్​ ప్యాలస్​ ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్​ మాన్షన్​గా పిలిచేవారు.ఈ భవంతిని కట్టిన వందేళ్లకు దీని పేరు వైట్​హౌస్​గా మార్చారు. అయితే వైట్​హౌస్​ఎన్నోసార్లు దాడికి గురయ్యింది. శత్రుసైనికులు దాడులకు పాల్పడ్డారు. అయినప్పటికీ అనేక మరమ్మతులు పొంది చివరకు ఈ రూపాన్ని సంతరించుకున్నది. 1812లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ ఈ భవనంపై దాడి చేసింది. అప్పట్లో ఈ భవంతి చాలావరకు నాశనం అయ్యింది. ఈ ఘటనను "బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్" గా పిలుస్తుంటారు.

అయితే 1812 అనంతరం అధ్యక్షుడిగా వచ్చిన జెమ్స్ మన్రో ఈ భవనానికి పాక్షిక పునర్నిర్మాణం చేసి ప్రవేశించాడు.1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ దీనికి మరమ్మతులు చేశాడు. 1948లో హేరీ ఎస్.ట్రూమన్ దీని ఇంటీరియర్ గదులను పూర్తిగా కూలగొట్టించి వైట్ పెయింట్ వేయించాడు.

వైట్​హౌస్​ ప్రత్యేకతలు ఏమిటంటే.. !

వైట్​హౌస్​కు 412 తలుపులు, 147 కిటికీలు, 8 స్టైర్ కేస్ లు, 132 గదులు, 35 బాత్ రూం లు ఉన్నాయి. వైట్​హౌస్​కు కేవలం బయటవైపు పెయింట్​ వేయాలంటే 570 గెలాన్స్ (సుమారు 2157 లీటర్ల) పెయింట్ అవసరమవుతుంది. ఒకేసారి140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్‌ టేబుల్‌, 13,000 చాకులు, చెంచాలు ఉన్నాయి. దీని నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులున్నారు. అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి వెచ్చించిన వాటికి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వారి తినడానికి అయ్యే ఖర్చు, డ్రై క్లీనింగ్, టూత్ పేస్ట్, ఇలా ప్రతి దానికి సంబంధించిన ప్రతి నెల చివరలో బిల్లు వస్తుంది. అది తన వార్షిక జీతం $ 400,000 నుంచి మైనస్ చేస్తారు.

రాళ్లెత్తిన కూలీలెవరు?

వైట్ హౌస్ ను ఐరోపా కళాకారులు నిర్మించారు. వలస కార్మికులైన స్కాటిష్ కార్మికులు, ఐరిష్, ఇటాలియన్ ఇటుక, ప్లాస్టర్ కార్మికుల సహాయంతో వైట్ హౌస్ ను నిర్మించారు. జేమ్స్ హోబాన్ ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు.

వైట్​హౌస్​లో బంకర్..!

వైట్​హౌస్​లో బంకర్​ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు బంకర్​లోకి వెళ్లి అక్కడి నుంచే సేవలు అందిస్తారు. ఇటీవల అమెరికాలో ఆందోళన కారులు వైట్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ పరిస్థితి ఉద్రికంగా మారి వైట్ హౌస్ పైకి దూసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ ను అధికారులు బంకర్ లోకి తీసుకెళ్లారు.