Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్రప‌తిని బోల్తా కొట్టించిన యాడ్‌

By:  Tupaki Desk   |   29 Dec 2017 2:30 PM GMT
ఉప‌రాష్ట్రప‌తిని బోల్తా కొట్టించిన యాడ్‌
X
ఆల‌సించిన ఆశాభంగం.. మంచిత‌రుణం మించిపోక ముందే అద్భుత‌మైన ఆఫ‌ర్ ను సొంతం చేసుకోండి. మీరు అధికంగా బ‌రువు ఉన్నారా? బ‌రువు త‌గ్గించుకోవ‌టానికి తెగ ట్రై చేస్తున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బ‌రువు త‌గ్గ‌ట్లేదా? నో ప్రాబ్లం. మీలాంటోళ్ల కోసం బ్ర‌హ్మండ‌మైన మందు మా ద‌గ్గ‌ర ఉంది. మీరు ఎలాంటి శ్రమ చేయ‌కుండా.. సింఫుల్ గా రోజుకు రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు.. మీరు బ‌రువు త‌గ్గిపోవ‌ట‌మే కాదు.. స్లిమ్ గా త‌యార‌వుతారు.

ఇలా.. టీవీ పెట్టిన వెంట‌నే.. కొన్ని ప్ర‌క‌ట‌న‌లు నాన్ స్టాప్ గా వస్తుంటాయి. తాము చెబుతున్న మాట‌కు త‌గ్గ‌ట్లే కొంద‌రు ఆ మాట‌ల్ని బ‌ల‌ప‌రుస్తూ.. త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల్లో చోటు చేసుకున్న మార్పు గురించి చెబుతుంటారు. మ‌రి.. వారు చెప్పే దాన్లో నిజం ఎంత‌న్న‌ది త‌ర్వాత‌.. ప్ర‌క‌ట‌న‌ను చూసినంద‌నే న‌మ్మేయ‌ట‌మేకాదు.. అర్జెంట్ గా ఆర్డ‌ర్ ఇచ్చేయ‌టం చూస్తుంటారు. అయితే.. అదంతా ప‌చ్చి మోస‌మ‌న్న విష‌యం ఆన్ లైన్లో ఆర్డ‌ర్ తెప్పించుకున్న త‌ర్వాత కానీ తెలీదు.

మాట‌ల్ని న‌మ్మేసి అమాయ‌కంగా ఆర్డ‌ర్ బుక్ చేసేసి మోస‌పోవ‌టం సామాన్యులే కాదు అస‌మాన్యులు కూడా ఉంటార‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా స్లిమ్ అయ్యే ప్ర‌క‌ట‌న‌ను చూసి.. మాట‌ల మాంత్రికుడిగా పేరున్న నేత‌.. ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వెంకయ్య‌నాయుడు కూడా ఉన్నారంటే అస్స‌లు న‌మ్మ‌లేం. వాక్ చాతుర్యంతో పాటు.. విశేష‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఆయ‌న‌.. మోస‌పూరిత‌మైన ప్ర‌క‌ట‌న‌తో తాను మోస‌పోయిన‌ట్లుగా చెప్పారు.

సులువుగా బ‌రువు త‌గ్గొచ్చొంటూ వ‌చ్చిన న‌కిలీ ప్ర‌క‌ట‌న‌ను చూసి తాను మోస‌పోయాన‌న్నారు. వెయ్యి రూపాయిల మందుల‌తో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌న్న ప్ర‌క‌ట‌న‌కు తాను డ‌బ్బులు చెల్లించి ఆర్డ‌ర్ చేశాన‌ని.. త‌ర్వాత పాకెట్ లో మందులు వ‌చ్చాయ‌ని.. త‌ర్వాత మ‌రో లేఖ వ‌చ్చింద‌ని.. మ‌రికొంత డ‌బ్బులు చెల్లిస్తే అస‌లు మందులు పంపుతామ‌ని పేర్కొన్నార‌ని.. అదంతా బూట‌క‌మ‌ని తన‌కు అర్థ‌మైంద‌న్నారు. తాను వెంట‌నే వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖ‌కు ఫిర్యాదు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌లు అమెరికా కేంద్రంగా వ‌చ్చిన‌ట్లుగా విచార‌ణ‌లో తేలింద‌న్నారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల్ని చూసి అస్స‌లు మోస‌పోకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. వెంక‌య్య లాంటోడే మోస‌పోతే.. మామూలోడి సంగ‌తేంది?