Begin typing your search above and press return to search.

పేర్ని నోట మ‌హేష్ డైలాగ్ వ‌చ్చిన వేళ‌!

By:  Tupaki Desk   |   9 July 2022 9:30 AM GMT
పేర్ని నోట మ‌హేష్ డైలాగ్ వ‌చ్చిన వేళ‌!
X
కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీలో ముఖ్య నేత‌గా వెలుగొందుతున్నారు.. పేర్ని నాని. జ‌గ‌న్ కు తాను పెద పాలేరున‌ని చెప్పుకుని నానికి సీఎం జ‌గ‌న్ మంచి ప్రాధాన్య‌తే ఇచ్చారు. త‌న మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ర‌వాణా, స‌మాచార ప్ర‌సార శాఖల మంత్రిగా పేర్నినానికి జ‌గ‌న్ అవ‌కాశ‌మిచ్చారు.

ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి అదే కులానికి చెందిన పేర్ని నానిని జ‌గ‌న్ బాగా వాడుకున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆశించిన‌ట్టే పేర్ని నాని కూడా ప‌వ‌న్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో త‌న సొంత కులాన్ని కూడా నిందించి వారి ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

అయితే ఇంత చేసినా పేర్ని నానికి మూడేళ్ల త‌ర్వాత జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ద‌క్క‌లేదు. మంత్రివ‌ర్గం నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడిగా పేర్నినానికి అవ‌కాశం ద‌క్కింది. మంత్రి ప‌దవి పోయాక ప్ర‌తిప‌క్ష నేతలపై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ్గించారు.

దీంతో పేర్ని నానికి ఏమైంద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి బంద‌రు వ‌స్తే త‌న అనుచ‌రుల చేత అడ్డుకోవ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. దీనిపై బాల‌శౌరి బ‌హిరంగంగానే పేర్నిపై విరుచుకుప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో పేర్ని నానికి బంద‌రు సీటు ద‌క్క‌ద‌నే వార్త‌లు వ‌చ్చాయి. బాల‌శౌరికి సీఎం జ‌గ‌న్ తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. అప్ప‌టి నుంచి సైలెంటుగా ఉన్న పేర్ని నాని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీన‌రీలో త‌న‌దైన శైలిలో మ‌రోమారు కార్య‌క‌ర్త‌ల‌ను ఉర్రూత‌లూగించారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సూప‌ర్ హిట్ చిత్రం భ‌ర‌త్ అనే నేను సినిమాలోని డైలాగ్ ను ప‌లికిన పేర్ని నాని ప్లీన‌రీ ప్రాంగ‌ణంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.

వైఎస్ విజ‌య‌మ్మ రాజీనామాపై ఎల్లో మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తోంద‌ని పేర్కొంటూ.. సుబ్బారావు గారు ఇలాంటి త‌ప్పుడు రాత‌లు రాసి దాని ద్వారా వ‌చ్చే డ‌బ్బుతో అన్నం అయితే వండుకోగ‌ల‌రు.. మీ పెళ్లాం, పిల్ల‌లు సంతోషంగా ఉంటారా అని భ‌ర‌త్ అనే నేను సినిమాలోని డైలాగ్ ను చెప్పారు. దీంతో ప్లీన‌రీ ప్రాంగ‌ణం కార్య‌క‌ర్త‌ల చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగింది.