Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ తీవ్రతరం ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   29 Jan 2022 10:50 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ తీవ్రతరం ఎప్పుడంటే?
X
దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం గా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది జూన్ తర్వాత తగ్గిన ఉద్ధృతి... మళ్లీ డిసెంబర్ రెండో వారం నుంచి అధికమైంది. ఆ తర్వాత కొత్త సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాల వల్ల వివిధ దేశాల్లో వైరస్ విధ్వంసం చేస్తోంది. మనదేశంలోనూ బాధితుల సంఖ్య లక్షలకు చేరింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కాస్త తక్కువే ఉంది. కాగా ఈ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరే సమయం రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత కొంత కాలంగా దేశంలో మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాల సరస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయని ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్ అన్నారు. రానున్న రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15 నాటికి థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కి చేరుతుందని అంచనా వేశారు. మరో వారం, పది రోజుల్లో పాజిటివ్ కేసులు మరింత పెరిగే అకాశం ఉందని ఆయన వివరించారు.

ఒమిక్రాన్ ప్రభావం తక్కువే ఉన్నా కూడా అతి త్వరగా వ్యాప్తి చెందుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కొత్త వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఎక్కువమందిలో లక్షణాలు బయటకు కనిపించడం లేదని... ఫలితంగా అతి త్వరగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేశారు. డెల్టాతో పోల్చితే దీని తీవ్రత చాలా తక్కువగా ఉందని అన్నారు. అయితే పాజిటివ్ కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతాయని వెల్లడించారు. ఇకపోతే చిన్నారులపై ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. ఒకవేళ సోకినా.. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో అతి త్వరగా కోలుకుంటారని వెల్లడించారు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

దేశంలో మూడో దశ వేగంవంతం అవుతోందని సూత్ర కన్సార్టియం పరిశోధకులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. డెల్టా వేరియంట్ ప్రభావంతో పోల్చితే ఇది చాలా స్పల్పమని అన్నారు. ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య చాలా తక్కువంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్రజలు వైరస్ పట్ల ఆందోళన చెందకుండా... కనీస జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు తగ్గాయి. 2,35,532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు పెరగడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. మహమ్మారి ధాటికి మరో 871 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.39శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.