Begin typing your search above and press return to search.

జ‌ల జ‌గ‌డంః శాశ్వ‌త ప‌రిష్కారం ఎప్పుడు?

By:  Tupaki Desk   |   2 July 2021 4:30 PM GMT
జ‌ల జ‌గ‌డంః శాశ్వ‌త ప‌రిష్కారం ఎప్పుడు?
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ జ‌ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మాట‌ల‌తో మొద‌లైన పంచాయితీ.. నోటీసులు దాటి ముందుకు వెళ్లింది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విష‌యంలో ఏపీ స‌ర్కారు అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రిస్తోందని, నిబంధ‌న‌ల‌ను ప‌క్కన‌బెట్టి మ‌రీ.. నిర్మాణం కొన‌సాగిస్తోంద‌ని తెలంగాణ స‌ర్కారు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తోంది. ఈ విష‌య‌మై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది.

మ‌రోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి కూడా మొద‌లు పెట్టింది తెలంగాణ‌. దీనిపై ఏపీ స‌ర్కారు అభ్యంత‌రం తెలిపింది. ఈ విష‌యాన్ని కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లాల‌ని మంత్రుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు. దీనిపై ఆ వెంట‌నే తెలంగాణ స్పందించింది. విద్యుత్ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్ప‌త్తి చేసి తీరుతామ‌ని, అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు.

అంతేకాదు.. శ్రీశైలంతో ఆగ‌కుండా.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత ముదిరింది. విద్యుత్ ఉత్ప‌త్తికి విఘాతం క‌ల‌గ‌కుండా పోలీసుల‌ను సైతం భారీగా మోహ‌రించింది తెలంగాణ స‌ర్కారు. ఈ నేప‌థ్యంలోనే.. సాగ‌ర్ లో విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపాల‌ని విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు ఏపీకి చెందిన అధికారులు, పోలీసులు సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. వారిని స‌రిహ‌ద్దు వ‌ద్ద‌నే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగ‌ర్ లోకి తెలంగాణ పోలీసులు అనుమ‌తించ‌లేదు. అంతేకాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇరిగేష‌న్‌ అధికారుల విన‌తి ప‌త్రాన్ని తీసుకునేందుకు.. సైతం తెలంగాణ అధికారులు నిరాక‌రించారు. దీంతో.. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. కృష్ణాన‌ది జ‌ల వివాదాన్ని కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో.. బంతి కేంద్రం కోర్టులో ఉంద‌ని, ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. అయితే.. సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. కేంద్ర ప్రభుత్వం ఈ కృష్ణాన‌ది నీటి పంచాయితీపై వెంట‌నే స్పందించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. రాజ‌కీయంగా బీజేపీకి రెండు రాష్ట్రాలు అత్యంత కీల‌కంగా ఉండ‌డంతో.. స‌త్వ‌ర‌మే ఈ విష‌యంలో జ‌డ్జిమెంట్ ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

అంతేకాదు.. ఎలాగో ఇది వ‌ర్షా కాల‌మే కాబ‌ట్టి, భారం ప్ర‌కృతికే వ‌దిలేస్తే.. స‌మ‌స్య చ‌ల్ల‌బ‌డుతుంద‌ని కూడా భావిస్తోంద‌ట బీజేపీ. ప్ర‌స్తుతం వ‌ర్షాలు జోరుగా కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌ నుంచి వ‌ర‌ద నీరు కృష్ణా న‌దిలోకి భారీగానే వ‌స్తోంది. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులు కూడా నిండే అవ‌కాశం క‌నిపిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌, ప్ర‌కాశం బ్యారేజ్ వంటి ప్రాజెక్టులు నిండితే.. ఈ స‌మ‌స్యకు ఆటోమేటిగ్గా తెర‌ప‌డుతుంద‌ని కూడా భావిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రి, ఇప్పుడంటే.. ఏదో ఒక కార‌ణంతో వివాదం చ‌ల్లారొచ్చు. కానీ.. ఇది శాశ్వ‌త‌మైన స‌మ‌స్య క‌దా.. తాత్కాలిక ప‌రిష్కారం భ‌విష్య‌త్ లో మ‌రింత పెద్ద స‌మ‌స్య‌కు దారితీయొచ్చు అనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్రాలు, కేంద్రం కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే వ్య‌వ‌హ‌రిస్తే.. అంతిమంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి, దీనికి ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం చెబుతుంద‌న్న‌ది చూడాలి.