Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   26 Jun 2021 8:32 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?
X
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది ‘హుజూరాబాద్’. పంతం మీద ఇక్కడ రాజకీయం సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి బీసీ మంత్రి ఈటల రాజేందర్ ను తీసేయడం.. ఆయన తొడగొట్టి రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. మాటల యుద్ధం కొనసాగడం జరిగిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ అంతే దూకుడుగా హుజూరాబాద్ లో బీజేపీ తరుఫున గెలవడానికి మకాం వేశాడు. విస్తృతంగా ఇంటింటికి తిరుగుతున్నాడు.

ఈటల రాజీనామాతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సైతం అప్రమత్తమయ్యాయి. ఉప ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కాకముందే అన్ని పార్టీలు హుజూరాబాద్ లో పాగ వేశాయి. టీఆర్ఎస్ మంత్రులు , నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక ఈటల రాజేందర్ తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులకు అన్యాయం జరిగిందని ఆ నేతలను చేరదీసి కేసీఆర్ కు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నారు. బీజేపీ నేతలతో కలిసి ఇప్పటికే మండలాల వారీగా బాధ్యతలు అప్పజెప్పి ముందుకు సాగుతున్నారు.

ఇక సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కేంద్రంలోని బీజేపీలోకి ఈటల చేరాడని.. కమ్యూనిస్టు అయిన ఈటల తనకు విరుద్ధమైన బీజేపీలోకి ఎందుకు వెళ్లారని.. ఆస్తులు కాపాడుకోవడానికే అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఇక ఈటలకు చెక్ పెట్టేందుకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అనుసరించిన ఫార్ములానే హుజూరాబాద్ లో అమలు చేసేందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతోంది.

ఇక పోయిన సారి ఈటల చేతిలో తృటిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి సైతం ఈసారి గెలుపే ధ్యేయంగా హుజూరాబాద్ లో దూసుకెళుతున్నారు. ఈ యువనేతకు రేవంత్ రెడ్డి సహా పలువురు సపోర్టు ఉంది. ఈసారి ఈటలను ఓడిస్తానంటున్నారు.

ఇక టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇప్పటివరకు ఈటలకు సరితూగే నేత మాత్రం దొరకలేదు. దీంతో పలువురు మాజీలు, కీలక నేతలను పరిశీలిస్తున్నారు.

ఇక ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ వరకు కరోనా పూర్తి స్థాయిలో తగ్గుతుందని.. అప్పటికీ ఈసీ హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని బీజేపీ నేతలు ఘంఠా పథంగా చెబుతున్నారు. దీంతో రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో ఆసక్తికర రాజకీయం రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.