Begin typing your search above and press return to search.

ఈ గౌతమబుద్ధ మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు కేటీఆర్?

By:  Tupaki Desk   |   4 April 2021 9:30 AM GMT
ఈ గౌతమబుద్ధ మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు కేటీఆర్?
X
రాజకీయాల్లో నోటికి పని చెప్పటం చాలా కామన్. ఒకప్పుడు మర్యాదకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి.. నిలువెత్తు విలువలతో ఉండే తెలగు రాజకీయాలు ఇప్పుడెంత గబ్బుగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయటం.. చిన్నా.. పెద్దా అన్నది చూసుకోకుండా విరుచుకుపడటం.. తేలిగ్గా తీసేయటం.. నువ్వెంత అంటే నువ్వెంత? అంటూ మండిపడటం ఈ మధ్యన ఎక్కువైంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తెలుగు రాజకీయాల్లో హుందాతనాన్ని తగ్గించి.. నోటికి ఏం వస్తే ఆ మాటల్ని మాట్లాడే కల్చర్ కు ఆరంభకులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గా చెప్పాలి.

ఉద్యమ నేతగా మారి రాజకీయ పార్టీ పెట్టిన ఆయన.. తన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. మీడియాలో మరింత ఫోకస్ అయ్యేందుకు ఆయన అనుసరించిన విధానం.. అప్పటి రాజకీయ ఫార్మాట్ లకు భిన్నంగా ఉండటం.. దాన్ని అలవాటు చేసుకోవటానికి తెలుగు ప్రాంతాల నేతలకు కాస్త సమయం పట్టింది. ఇప్పుడు కేసీఆర్ మాటలు.. చేతలు.. ఏ విషయంలో ఆయన ఎలా స్పందిస్తారు? లాంటి విషయాల మీద అందరికి ఒక స్పష్టత ఉంది.
గడిచిన ఏడేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా అధికార పక్షంలో ఎవరున్నా.. విపక్షాలు వేలెత్తి చూపించే వీలుంది. అదే సమయంలో విపక్షాలు చేసే విమర్శలకు అధికారపార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే.. ఇందుకు భిన్నంగా తెలంగాణలో విపక్షాలు అదే పనిగా కేసీఆర్ ను విమర్శించటం భారీగా పెరిగింది.

కేసీఆర్ ను దూషించటానికి ఆయన మార్గాన్నే చాలామంది ఎంచుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన చాలా కటువుగా ఉండేవారు. ఏం మాట్లాడుతారో అన్న ఆందోళనతో ఇతర పార్టీ నేతలు ఉండేవారు. ఒకవేళ.. కేసీఆర్ ను తప్పు పడితే.. అది తెలంగాణ ద్రోహమన్న రేంజ్ లో బిల్డప్ కనిపించేది. దీంతో.. నేతలు ఎవరూ తొందరపడేవారు.కానీ.. అధికారం అదే పనిగా పోగుబడిన కేసీఆర్ ను కదిలించుకుంటే.. ఏం సమస్యలు మీద పడతాయన్న ఆందోళన ఉండేది.
ఎప్పుడైతే ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఎన్నికల తీర్పుతో ప్రజలు స్పష్టం చేసిన తర్వాత నుంచి కేసీఆర్ ను అదే పనిగా విమర్శించే తీరు ఎక్కువైంది. మిగిలిన నేతలతో పోలిస్తే.. తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ బాటలో నడుస్తూ.. వెనుకా ముందు మాట్లాడకుండా విరుచుకుపడుతున్నారు. దీంతో తెలంగాణ అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఒక సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.

ఇప్పుడు ఎవరు పడితే వారు.. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ను తిడుతున్నారని.. తాముఅలాంటి పిచ్చి మాటల్ని మాట్లాడమని.. స్పందించమన్న విషయం ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. మాటకు మాట అన్నట్లుగా రియాక్టు అయ్యేపార్టీ ఇప్పుడు పూర్తిగా మారిపోవటం.. అందునా గౌతమ బుద్ధుడి తరహాలో కలరింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా విమర్శల గొంతులు పెరిగే కొద్దీ.. వాటిని కంట్రోల్ చేయలేకనే.. గౌతమ బుద్ధుడి తరహాలో బిల్డప్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవే మాటల్ని.. పుష్కరం కిందట ప్రయోగిస్తే ఇప్పుడు చేతిలో ఉన్న అధికారం అస్సలు వచ్చేది కాదేమో కేటీఆర్?