Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా టాప్ క్రికెట‌ర్ల క‌న్నీళ్లు

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:28 PM GMT
వైర‌ల్ గా టాప్ క్రికెట‌ర్ల క‌న్నీళ్లు
X
టాప్ మోస్ట్ క్రికెట‌ర్లేంది.. క‌న్నీళ్లేంద‌న్న డౌట్ అక్క‌ర్లేదు. ఇది నిజంగా నిజం. కాకుంటే.. వేర్వేరు సంద‌ర్భాల్లో చోటు చేసుకున్న క‌న్నీళ్లకు సంబంధించిన వివ‌రాలు ఒకే రోజు బ‌య‌ట‌కు రావ‌టం విశేషం. మిస్ట‌ర్ కూల్ గా పేరున్న ధోనీ భావోద్వేగ‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలుసా? ఒక షోలో పాల్గొన్న సంద‌ర్భంగా యూవీ కంట త‌డి.. అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ గా త‌న కెరీర్ షురూ చేసిన హైద‌రాబాదీ క్రికెట‌ర్ సిరాజ్ క‌న్నీళ్లు.. ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

ఒకేరోజు ముగ్గురు అగ్ర‌శ్రేణి క్రికెట‌ర్ల కంట‌త‌డికి సంబంధించిన స‌మాచారం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇంత‌కీ ఈ ముగ్గురు ఏయే సంద‌ర్భాల్లో కంట‌త‌డి పెట్టారు? దాని నేప‌థ్యం ఏమిట‌న్న‌ది చూస్తే..?

మిస్ట‌ర్ కూల్ అన్న పేరుకు త‌గ్గ‌ట్లే.. భావోద్వేగాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తూ దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచేసిన జార్ఖండ్ డైన‌మేట్ ధోనీ క్రికెట్ మైదానంలో త‌న‌ను తాను నియంత్రించుకోలేక ఆయ‌న కంట ఆనంద భాష్పాలు జ‌ల‌జ‌లా రాలాయా? అంటే అవున‌నే చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని ఈ విష‌యం ఇప్పుడే ఎలా వ‌చ్చిందంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. 2011లో ముంబ‌యిలోని వాఖండే స్టేడియంలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఆకాశాన్ని అంటేలా ఆనందం వెల్లివిరిసింది. ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న క‌ల క‌ళ్ల ముందుకు సాక్ష్యాత్క‌రించ‌టంతో ప్రతిభార‌తీయుడుపొంగిపోయాడు. జాతి యావ‌త్తు భావోద్వేగంతో క‌దిలిపోయింది.

కోట్లాది మందిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ విజ‌యానికి కార‌ణ‌మైన కెప్టెన్ ధోనీ సైతం త‌న భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక‌పోయార‌ట‌. త‌న స‌హ‌చ‌రులంతా ఆనందంతో గెంతులేస్తున్న వేళ‌.. ధోని కంట క‌న్నీరు కారింద‌ట‌. అయితే.. అంద‌రూ ఉండ‌టంతో ఆ దృశ్యం కెమేరా కంటికి చిక్క‌లేదంతే. డెమోక్ర‌సీ-ఎలెవ‌న్ అనే పుస్త‌కాన్ని రాసిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్.. ధోనీకి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాన్ని చెప్పటం వైర‌ల్ అయ్యింది.

క్రీజ్ లో అడుగు పెట్టిన క్ష‌ణం నుంచి ఫోర్లు.. సిక్స‌ర్ల మీద దృష్టి పెట్టే దూకుడు క్రికెట‌ర్ గా యువ‌రాజ్ సింగ్ కు పేరుంది. అత‌గాడి దూకుడు ఆటను అస్వాదించ‌ని క్రీడాభిమాని ఉండ‌రు. అయితే.. యువ‌రాజ్ జీవితంలో డ్రామాకు కొద‌వ‌లేదు. కేన్స‌ర్ బారిన ప‌డి..దాన్ని జ‌యించాడు. క్రికెట్ ఆడితే బ‌త‌క‌డ‌న్న మాట నుంచి కోలుకొని క్రికెట్ ఆడి అంద‌రి మ‌న‌సుల్ని దోచేలా చేయ‌టం యువ‌రాజ్‌కే సొంతం.

తాజాగా కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌డి కార్య‌క్ర‌మంలో యువ‌రాజ్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యువ‌రాజ్ తో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ ఉన్నారు. ఈ షోలో త‌న జీవితంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి చెబుతూ.. కేన్స‌ర్ పై మాట్లాడే సంద‌ర్భంలో ఎమోష‌న‌ల్ అయ్యారు. కంట క‌న్నీరు పెట్టుకున్నారు. ప‌క్క‌నే ఉన్న విద్యాబాల‌న్ ఓదార్చారు. కేన్స‌ర్ బారిన ప‌డిన‌ప్పుడు క్రికెట్‌ను వ‌దిలేయాల‌ని వైద్యులు చెప్పార‌ని.. స‌రైన చికిత్స తీసుకోక‌పోతే తాను ఇప్పుడు బ‌తికి ఉండేవాడిని కాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా అత‌డి కంట క‌న్నీరు కార‌టంతో అక్క‌డి వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా ఉద్విగ్న‌మైంది.

ఆటోవాలా కొడుకు అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ కావ‌టం సాధ్య‌మేనా? అంటే నో అనేస్తారు. కానీ.. అది త‌ప్ప‌ని చేత‌ల్లో చేసి చూపించాడు హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్‌. వీధుల్లో ఆడ‌టం మొద‌లెట్టి విశ్వ‌క్రీడా వేదిక మీద ఆట‌ను షురూ చేశారు. తొలిసారి అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌.. ఆట ప్రారంభంలో భావోద్వేగానికి గుర‌య్యాడు.

న్యూజిలాండ్ జ‌ట్టుతో టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా టీమిండియా ఆట‌గాళ్ల‌తో పాటు మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి గుర‌య్యాడు సిరాజ్‌. ఇటీవ‌ల రిటైర్ అయిన సీనియ‌ర్ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రీ స్థానంలో సిరాజ్‌ను ఆహ్వానిస్తూ టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి బ్లూ క్యాప్ అంద‌చేసిన స‌మ‌యంలో భావోద్వేగానికి గురైన సిరాజ్‌.. జాతీయ గీతం ఆల‌పించే వేళ‌లోనూ ఆనంద భాష్పాలు ఉబికివ‌చ్చాయి.