Begin typing your search above and press return to search.

చిన్నారిని లైంగిక దాడి చేశానంటూ గొప్ప‌లు

By:  Tupaki Desk   |   26 April 2018 5:46 AM
చిన్నారిని లైంగిక దాడి చేశానంటూ గొప్ప‌లు
X
ఎక్క‌డికి పోతున్నాం. ఏమైపోతున్నాం? ఏది గొప్ప‌? ఆరాచ‌కాన్ని సైతం ఏదో పొడిచేసిన‌ట్లుగా.. మ‌రేదో సాధించిన‌ట్లు చెప్పుకుంటున్న వైనం చూస్తే ఒళ్లు కంప‌రంగా మార‌టం ఖాయం. పోయేకాలం కాకుంటే.. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిపై లైంగిక దాడి చేశాన‌ని ఓపెన్ గా వాట్సాప్ లో గొప్ప‌లు చెప్పుకోవ‌టం ఏమిటి? ఆ వీర‌త్వాన్ని(?) మ‌రొక‌రు కీర్తించేస్తూ శ‌భాష్ అనే రీతిలో పొగిడేయ‌టం ఏమిటి?

వినేందుకే వికారంగా అనిపించే ఈ ఉదంతం హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. న‌గ‌రంలోని మియాపూర్ కు చెందిన కొంత‌మంది యువ‌కులు క‌లిసి బ్రింగింగ్ టుగెద‌ర్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. దీనికి కుశాల్ అనే వ్య‌క్తి ఆడ్మిన్ గా ఉన్నారు. ఈ గ్రూపులో చిన్నారుల లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లుగా ఒక‌రు పోస్ట్ చేశారు. దీనిని మెచ్చుకుంటూ మ‌రొక‌రు తిరిగి పోస్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఈ దారుణం గురించి స‌మాచారం అందుకున్న బాల‌ల హ‌క్కుల సంఘం ప్ర‌తినిధులు సైబ‌రాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై ద‌ర్యాప్తు చేయాల‌ని కూక‌ట్ ప‌ల్లి పోలీసుల్ని సీపీ ఆదేశించారు. దీనిపై విచారించిన పోలీసులు స‌ద‌రు యువ‌కుడి దురాగ‌తాన్ని గుర్తించి ఆ యువ‌కుడిపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

గ్రూపు ఆడ్మిన్ ల‌తో పాటు పోస్టులు పెట్టిన యువ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసుల‌కు చెప్పారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకున్న యువ‌కుడ్ని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌నిషిలోని రాక్ష‌స‌త్వం రాక్ష‌సులు సైతం సిగ్గుప‌డేలా చేస్తున్న ఈ ఉదంతాల్ని చూసిన‌ప్పుడు క‌నీసంగా ఉండాల్సిన మాన‌వ‌త్వం ఎందుకు ఉండ‌టం లేద‌న్న ప్ర‌శ్న క‌ల‌గ‌టం ఖాయం.