Begin typing your search above and press return to search.

వాట్సాప్ గ్రూపులో జ‌ర జాగ్ర‌త్త‌.. తేడా వ‌స్తే అరెస్టే!

By:  Tupaki Desk   |   2 March 2019 4:57 AM GMT
వాట్సాప్ గ్రూపులో జ‌ర జాగ్ర‌త్త‌.. తేడా వ‌స్తే అరెస్టే!
X
ఇవాల్టి రోజున వాట్సాప్ వాడ‌నోళ్లు లేరు. ఒక‌సారి వాట్సాప్ వాడ‌టం మొద‌లెడితే.. ఏదో గ్రూపులో స‌భ్యుడిగా ఉండ‌టం.. అలాంటి గ్రూపులు బోలెడ‌న్ని ఒక్కొక్క‌రి అకౌంట్లో ఉండ‌టం మామూలే. ఈ గ్రూపుల్లో త‌మ‌కు తెలిసిన స‌మాచారాన్ని.. ఫోటోల్ని.. వీడియోల్ని షేర్ చేసే ఔత్సాహికులు ఎంద‌రో. అయితే.. ఇలా గ్రూపుల్లో పోస్టులు పెట్టే ఉత్సాహ‌వంతులు కొన్నిసార్లు తెలీకుండానే త‌ప్పులు చేస్తుంటారు.

మ‌న‌సులో ఏమీ లేనోళ్లు కూడా అడ్డంగా బుక్ అవుతారు. వాట్సాప్ గ్రూపులో పెట్టే పోస్టులో ఏదైనా తేడా కొడితే నేరుగా జైలుపాలే. ఈ విష‌యం తాజాగా మ‌రోసారి రుజువైంది. హైద‌రాబాద్ లోని మౌలాలి ష‌ఫీన‌గ‌ర్ లో నివ‌సించే మ‌హ‌మ్మ‌ద్ సాహెబాబ్ ఉల్ మునీర్ అలియాస్ 26 ఏళ్ల సిరాజ్ జొమాటోలో డెలివ‌రీ బాయ్ గా ప‌ని చేస్తుంటారు.

ఇత‌డితో పాటు అదే కంపెనీలో ప‌ని చేసే క‌మ్మంప‌ల్లి వెంక‌టేశ్ ఆ సంస్థ‌లో ప‌ని చేసే వారి కోసం లాయ‌ల్ పార్ట‌న‌ర్స్ ఎమ‌లార్డ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ నిర్వ‌హిస్తుంటాడు. నాగార్జున న‌గ‌ర్ లో ఉండే ఇత‌ను వాట్సాప్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటారు.

ఇదిలా ఉంటే ఫిబ్ర‌వ‌రి 26న జాతీయ ప‌తాకాన్ని త‌గుల‌బెడుతున్న ఒక చిత్రాన్ని ఆ గ్రూపులో సిరాజ్ పోస్ట్ చేశాడు. దీన్ని అదే గ్రూపులోని మ‌రో స‌భ్యుడు తిరుమ‌లేశ్వ‌ర‌రెడ్డి చూశాడు. ఈ చిత్రం విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ఉందంటూ గ‌త మంగ‌ళ‌వారం మ‌ల్కాజిగిరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం సిరాజ్ ను.. ఆ గ్రూపు నిర్వాహ‌కుడు వెంక‌టేశ్ పైన కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. రిమాండ్ కు త‌ర‌లించారు. గ్రూపు లో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టే వారు మాత్ర‌మే కాదు.. ఆ గ్రూపు ఆడ్మిన్ కూడా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. అందుకే.. వాట్సాప్ గ్రూపులో ఆడ్మిన్ గా ఉండ‌టం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. తేడా వ‌స్తే నేరుగా క‌ట‌క‌టాల వెన‌క్కే. జ‌ర.. జాగ్ర‌త్త‌గా ఉండండి.