Begin typing your search above and press return to search.

అకస్మాత్తుగా జగన్ హైదరాబాద్ ఎందుకు వెళ్లారంటే?

By:  Tupaki Desk   |   29 Jan 2020 6:38 PM IST
అకస్మాత్తుగా జగన్ హైదరాబాద్ ఎందుకు వెళ్లారంటే?
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ - మాజీ మంత్రి - ఎంపీ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ దారుణహత్య .. రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో చర్చలకు దారితీసింది. దీనిపై గత ప్రభుత్వం సిట్ వేయగా..ప్రస్తుత ఏపీ సీఎం అయిన సీఎం జగన్ సిట్ ని వ్యతిరేకించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అని, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసారు.

ఇకపోతే, ఈ కేసు విచారణ ఇలా సాగుతున్న సమయంలోనే ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలలో వైసీపీ ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తరువాత ఈ కేసు పై మరో కొత్త సిట్ ఏర్పాటు చేయించి ,సీఎం జగన్ ఈకేసు విచారణ వేగవంతం చేసారు. అయితే, అప్పుడు సిట్ వద్దు అని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన సీఎం ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చి సిట్ ఎందుకు వేసారో చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసును సీబీఐకి అప్పగిస్తారని ఇన్నాళ్లూ ఎదురు చూశానని, కానీ జగన్ ఆకోణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అని తెలిపారు. ఇకపోతే, వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మంగళవారం ఆయన కుమార్తె సునీత హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్ల రామయ్య మాట్లాడుతూ...గతంలో సీబీఐ విచారణ అడిగిన జగన్‌.. సీఎం అయ్యాక ఎందుకు జాప్యం చేస్తున్నారు. సీఎం జగన్‌ హైదరాబాద్‌ రహస్య పర్యటనకు కారణాలేంటి? హఠాత్తుగా హైదరాబాద్‌ ఎందుకెళ్తున్నారు? సోదరి సునీతను కలిసి రిట్‌ పిటిషన్‌పై ప్రశ్నించడానికి వెళ్తున్నారా? పిటిషన్‌ను వెనక్కి తీసుకునేలా చేయడానికి వెళ్తున్నారా? అని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. సునీత రిట్‌ పిటిషన్‌లో అనుమానితుల జాబితా ఇచ్చారని, సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.