Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ గురించి అస‌లు వైసీపీ మదిలో ఉంది ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 6:00 AM GMT
బీఆర్ఎస్ గురించి అస‌లు వైసీపీ మదిలో ఉంది ఇదేనా?
X
జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి త‌న స‌త్తా చాటాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ద్వారా కేంద్రంలో అధికార బీజేపీకి షాకివ్వాల‌నే యోచ‌న‌లో ఉన్నారు.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా, వ్య‌తిరేకంగా అనేక కామెంట్స్ వ‌స్తున్నాయి.

ముఖ్యంగా కేసీఆర్‌.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాలపై ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు భారీగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వారి ఓట్ల‌తోపాటు ఆయా రాష్ట్రాల్లో రైతుల‌ను ఓట్లను కొల్ల‌గొట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషించిన కేసీఆర్ పార్టీని ఏపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని వైసీపీ నేత‌లు తేల్చిచెబుతున్నారు. వ‌చ్చే 25 ఏళ్లు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే సీఎంగా ఉంటార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీతో త‌మ‌కొచ్చే న‌ష్టం, క‌ష్టం ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సైతం ఎవ‌రికైనా పార్టీ పెట్టుకునే హ‌క్కు, స్వేచ్ఛ ఉన్నాయ‌ని పేర్కొంటూనే తాము ఎవ‌రి కూట‌మిలో, ఫ్రంట్‌లో క‌ల‌వ‌బోమ‌ని తేల్చిచెప్పారు.

అయితే తోటి తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 పార్ల‌మెంట‌రీ స్థానాలు ఉన్నాయి. ఏపీకి చెందిన ఎంతో మంది ఇప్ప‌టికీ హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. వీరిలోనే రాజ‌కీయ నేత‌లే ఎక్కువ‌. త‌మ రాజ‌కీయాల‌ను ఏపీలో చేస్తున్న ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్ప‌టికీ హైద‌రాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. వీరిలో ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌కు చెందిన‌వారు తెలంగాణ‌లో పలు కాంట్రాక్టు ప‌నులు చేస్తున్నారు. అలాగే ఏపీకి చెందిన రాజ‌కీయ నేత‌ల‌కు హైద‌రాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాపారాలు, ఆస్తులు కూడా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ వీరిపై సామదాన దండోపాయాలు ప్ర‌యోగించి ఏపీలో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ స‌రిహ‌ద్దు జిల్లాలైన క‌ర్నూలు, గుంటూరు, కృష్ణాల‌తోపాటు రాయ‌ల‌సీమ జిల్లాలు క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ త‌ర‌ఫున అభ్య‌ర్థులను పెట్ట‌వచ్చ‌ని తెలుస్తోంది. ఈ ఉమ్మ‌డి జిల్లాల్లో క‌నీసం 4, 5 సీట్ల‌ను సాధించాల‌ని కేసీఆర్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చెబుతున్నారు.

కేసీఆర్ పార్టీ ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయ‌ని.. త‌ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని వైసీపీ అంచ‌నాలు వేసుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. చివ‌రి నిమిషంలో బీజేపీ కూడా క‌ల‌వ‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్ట‌త‌నిచ్చేశారు. చంద్ర‌బాబు సైతం ప‌రోక్షంగా ప‌లు సంద‌ర్భాల్లో పొత్తుల‌కు అనుకూల‌మ‌న్న‌ట్టే మాట్లాడారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి విశ్లేష‌కుల వ‌ర‌కు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు మొత్తం జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికి వెళ్ల‌కుండా చేయాల‌ని వైసీపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే కొంత ఓటు బ్యాంకును ఆ పార్టీ లాగుకుంటుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని వైసీపీ భారీ అంచ‌నాలే పెట్టుకుంద‌ని అంటున్నారు.

అందుకే బీఆర్ఎస్ కూట‌మిలో చేర‌కుండా ఒంట‌రిగా పోటీ చేయ‌డానికే వైసీపీ మొగ్గుచూపుతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ మంత్రులు, నేత‌ల విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

ఇటీవ‌ల తెలంగాణ మంత్రులు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవ‌డం, సంద‌ర్భం లేక‌పోయినా విమ‌ర్శ‌లు చేయ‌డం, ఇందుకు ప్ర‌తిగా వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి రెండు రాష్ట్రాల్లో జ‌గ‌న్‌, కేసీఆర్ ల‌బ్ధి పొందాల‌నే వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్, వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని భావిస్తున్న‌వారు లేక‌పోలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.