Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు లేకుండా మీటింగ్ ఏంటీ?

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:47 AM GMT
ఆ ముగ్గురు లేకుండా మీటింగ్ ఏంటీ?
X
ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ రేట్ల వివాదం టాలీవుడ్ ని గ‌త కొన్ని నెల‌లుగా తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తోంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాలు న‌ష్టాల‌ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. టికెట్ రేట్ల‌ని పెంచ‌డంతో పాటు క్రేజీ చిత్రాలు విడుద‌లైన సంద‌ర్భంగాలో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా థియేట‌ర్ల చేకింగ్ పేరుతో చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌ని సీజ్ చేయ‌డం కూడా టాలీవుడ్ కి తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసింది. గ‌త ప‌ది నెల‌లకు పైగా టాలీవుడ్ లో టికెట్ రేట్ల‌తో పాటు థియేట‌ర్ల సీజ్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తే హాట్ చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ఆ త‌రువాత టాలీవుడ్ వ‌ర్గాల‌పై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం... దానికి కౌంట‌ర్‌గా టాలీవుడ్ నిర్వాత‌ల మండ‌లి ఘాటుగా స్పందించ‌డంతో ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరింది. సీనియ‌ర్ నిర్మాత, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌రద్వాజ ఏపి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను ఉద్దేశించిన అన్న మాట‌లు టాలీవుడ్ లో సంచ‌నాన్ని సృష్టించాయి. బ‌లుపెక్కి కొట్టుకుంటున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌ని అడిగితే తెలుస్తుందని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డంతో వివాదం మ‌రింత‌గా ముదిరింది.

అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని మెగాస్టార్ చిరంజీవి ఏపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ని భోజ‌న విరామ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా క‌ల‌వడానికి ప్ర‌య‌త్నించ‌డం, అందుకు సీఎం జ‌గ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఇద్ద‌రు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ త‌రువాత చిరు రాజ్య‌స‌భ‌ సీటు కోస‌మే ప్ర‌త్యేకంగా క‌లిసార‌ని ఊహాగానాలు పుట్టుకు రావ‌డంతో అస‌లు స‌మ‌స్య ప‌క్క‌దారి ప‌ట్టింది. మెగాస్టార్ చిరంజీవి స‌హా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ని క‌లిసి టికెట్ రేట్ల విధానం, సినీ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా అమ‌రావ‌తి వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రిని క‌లిసినా ఇప్పటికీ ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. దీంతో మ‌రోసారి ఆయ‌న‌ని క‌ల‌వడానికి మెగాస్టార్ చిరంజీవి క‌ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌తో క‌లిసి ఎవ‌రు వెళుతున్నార‌న్నదానిపై ఆసక్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు వెళుతున్నార‌ని వారితో పాటు మ‌రి కొంత మంది టాలీవుడ్ బిగ్గీస్ వెళ్లే అవ‌కాశం వుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ స‌మ‌స్య‌ని ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న ముగ్గురు పెద్ద త‌ల‌యాలు మాత్రం ఈ మీటింగ్ కి వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది. ఆ ముగ్గురు మ‌రెవ‌రో కాదు అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, డి. సురేష్ బాబు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌ధాన థియేట‌ర్ల‌న్నీ వీరి చేతుల్లోనే వున్నాయ‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా టిక్కెట్ రేట్ల త‌గ్గుద‌ల‌, థియేట‌ర్ల సీజ్ విష‌యంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వ్య‌క్తులు వీరే. అలాంటి వీరు సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌బోతున్న మీటింగ్ కు వీళ్లు గైర్హాజ‌ర్ కావ‌డం ఏంట‌న్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.

ఇది తెలిసిన వాళ్లంతా ఈ ముగ్గురు పెద్ద త‌ల‌యాలు లేకుండా మీటింగ్ ఏంటీ? అని సెటైర్లు వేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ప్ర‌ధానంగా ఏ విష‌యానికైనా ముందు వ‌రుస‌లో నిలిచే డి. సురేష్ బాబు, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు లేకుండా మీటింగ్ ఏంటి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా పెద‌వి విరుస్తున్నాయి. దీనిపై మ‌రో వ‌ర్గం వాద‌న మ‌రోలా వుంది. ఏపీకి వైఎస్ జ‌గ‌న్ సీఎం అయ్యాక టాలీవుడ్ నుంచి బిగ్ స్టార్స్ ఎవ‌రూ వెళ్లి జ‌గ‌న్ ని ప్ర‌త్యేకంగా అభినందించిన సంద‌ర్భాలు లేవ‌ని, అందుకే చిరంజీవితో పాటు మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ తో పాటు ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ సారి ప్ర‌త్యేకంగా జ‌గ‌న్‌ని క‌లిసి అబినందించాల‌ని భావిస్తున్నార‌ని, ఇదే సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ని కూడా ప్ర‌స్తావించి జ‌గ‌న్ ని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌నుకుంటున్నార‌ని చెబుతున్నారు.

అయితే ఏది ఏమైనా దిల్ రాజు, సురేష్‌బాబు, అల్లు అర‌వింద్ తాజా మీటింగ్ కి వెళ్ల‌క‌పోవ‌డం ఎవ‌రికీ రుచించ‌డం లేద‌ని, ఇంత‌కు ముందు రెండు మూడు సార్లు జ‌గ‌న్ ని క‌లిసిన వీరు విసిగిపోవ‌డం వ‌ల్లే మ‌రోసారి ఆయ‌న‌ని క‌ల‌వ‌డానికి ఆస‌క్తిని చూపించడం లేదా? అని ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.