Begin typing your search above and press return to search.

ప్రజల కోసం వైసీపీ, టీడీపీ ఏం చేయవా..?

By:  Tupaki Desk   |   23 March 2021 8:47 AM GMT
ప్రజల కోసం వైసీపీ, టీడీపీ ఏం చేయవా..?
X
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి గానీ.. ప్రజల బతుకులు మారడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.. ప్రజల పేరు చెప్పి అధికారంలోకి వస్తున్న పార్టీలు వారికోసం ఏమి చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం తప్ప అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం సామాన్యులకు చేసిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ ప్రతీకారం తీర్చుకునేసరికే పదవీ కాలం కాస్త అయిపోతుందంటున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తుగా మారడం తప్పితే చేసేదేమీ లేదన్న చర్చ సాగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత రాష్ట్రంలో రెండు పర్యాయాల్లో రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మన వద్ద వనరులు ఏమీ లేవని, వాటిని సమకూర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు పాలనను గాడిలో పెట్టేసరికే ఐదేళ్లు పూర్తయింది. చివరి నిమిషంలో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంతో విఫలమయ్యారని ఆరోపిస్తూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైపీపీ ఆందోళనను చేసింది. అంతేకాకుండా ఐదుగురు వైసీపీ ఎంపీలు స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా కూడా చేశారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన బెట్టారు. అప్పట్లో ఇదే వైసీపీ.. బీజేపీకి టీడీపీ తొత్తుగా మారి ప్రత్యేక హోదా తీసుకురావడంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది.. అయితే ఇప్పుడు ఎంపీల బలగం ఎక్కువగా ఉన్న వైసీపీకి ఆ విషయం పైకి లేవనెత్తనీయడం లేదు. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ గా గెలవడంతో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, తమకు తిరుగులేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

అధికారంలో ఏ పార్టీ ఉంటే లోకల్ ఎలక్షన్ ఆ పార్టీకే అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందున్న కొన్ని సంక్షేమ పథకాలకు మరిన్ని జోడించి అందిస్తూ నవరత్నాలు అని చెప్పిన జగన్ మిడిల్ క్లాస్ మ్యాన్ అవసరమేంటని మాత్రం గుర్తించడం లేదు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపైనే వైసీపీ తీరు కాలం గడిపేలా ఉండడంతో ఇక సామాన్యులను పట్టించుకునేదెవరని కొందరు అడుగుతున్నారు.

రాష్ట్రంలోని మిగతా పార్టీలైన జనసేన, బీజేపీలు ఏవో మతతత్వ ఆందోళనలు చేయడం తప్ప. ప్రజలు గగ్గోలు పెడుతున్నా ధరలు, ఇతర విషయాల్లో వారి తరుపున పోరాడడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నాయి. కేవలం ఎన్నికల కోసమే పార్టీలు పనిచేస్తున్నాయని.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందు పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా చేయడం వరకే కాలం గడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.