Begin typing your search above and press return to search.

ఎంఐఎం స‌భ‌లు.. ఏం తేలుస్తారు?

By:  Tupaki Desk   |   25 Feb 2023 4:00 PM GMT
ఎంఐఎం స‌భ‌లు.. ఏం తేలుస్తారు?
X
హైద‌రాబాద్ కేంద్రంగా ఉద్భ‌వించిన అస‌దుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం తొలిసారి జాతీయ‌స్థాయిలో స‌భ‌లు నిర్వ‌హిస్తోంది. రెండు రోజుల పాటు నిర్వ‌హించే ఈ స‌భ‌ల‌కు ముంబైని వేదిక‌గా చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఏం తేలుస్తారు? ఎవ‌రి వైపు ఎంఐఎం నిలుస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. అది కూడా ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణ‌ను కాద‌ని.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే మ‌హారాష్ట్ర‌ను ఎంచుకోవ‌డం వంటి విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

ఇప్పటిదాకా హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్‌, కరీంనగర్‌, ఉమ్మడి రాష్ట్రంలో కర్నూల్‌లో పరిమిత స్థాయిలో పార్టీ సదస్సులు నిర్వహించిన మజ్లిస్‌.. తొలిసారి మహారాష్ట్రలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తుండడం ప్ర‌థ‌మ‌మ‌నే చెప్పాలి. మహారాష్ట్రలో పార్టీ బలాన్ని చాటడంతోపాటు జాతీయ స్థాయిలో త‌మ స‌త్తాని నిరూపించుకునేందుకు ఈ స‌ద‌స్సును కీల‌కంగా చేసుకున్న‌ట్టు స‌మ‌చారం.

పార్టీ ఎంపీలు, ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు, పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటు న్న ఈ స‌ద‌స్సుకు.. జాతీయ‌ మీడియాను సైతం ఆహ్వానించారు. భావసారూప్యం గల పార్టీలు, మైనారిటీల కోసం పని చేసే సంస్థలు, దళిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతున్న సంఘాలతో సంప్ర దింపులు జరిపి ఎన్నికల అవగాహనకు రావాలని మజ్లిస్‌ భావిస్తోంది.

అయితే.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్ విష‌యంలో ఎంఐఎం ఎలాంటి వైఖ‌రి తీసుకుంటుంద‌నేది ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

అదే స‌మ‌యంలో ఈ ఏడాది తెలంగాణ‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌నీసం 15 స్థానాలు గెలుచుకుని స‌భ‌లో బ‌లం నిరూపిస్తామ‌ని.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఇటీవ‌ల స‌భ‌లోనే ప్ర‌తిజ్ఞ‌చేసిన నేప‌థ్యంలో ఈ విష‌యానికి కూడా ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఇక‌, కేంద్రంలో బీజేపీకి బీ2గా ఉన్న‌ద‌నే ముద్ర‌ను చెరిపేయాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు.

దీంతోపాటు... కేంద్రంలో స‌త్తా నిరూపించుకునేందుకు యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల‌పై దృష్టి పెట్టే ఆలోచ‌న కూడా చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఏపీలోనూ ఈ సారి ఎంఐఎం దృష్టి పెట్ట‌నుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎలాంటి దిశానిర్దేశం ఉంటుంది.. ఏ విధంగా పార్టీ పుంజుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.