Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని మీద కేసీఆర్‌ ఏం చెబుతారు?

By:  Tupaki Desk   |   20 Jan 2023 12:30 AM GMT
ఏపీ రాజధాని మీద కేసీఆర్‌ ఏం చెబుతారు?
X
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్‌ కు అదంత తేలికైన విషయమైతే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణతోపాటు ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ గట్టి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న కేసీఆర్‌ ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

ముగ్గురు ముఖ్యమంత్రులను, ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తాజాగా ఖమ్మంలోనూ భారీ బహిరంగ సభను కేసీఆర్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి బీఆర్‌ఎస్‌ సభ ఏపీలో ఉంటుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. విశాఖపట్నంలో ఈ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీ రాజధాని విషయంలో కేసీఆర్‌ ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

ఎందుకంటే గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్‌ సైతం హాజరయ్యారు. తోటి తెలుగు రాష్ట్రంగా ఏపీ అభివృద్ధికి శాయశక్తులా సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్‌ అడుగడుగునా అడ్డు తగులుతూనే వచ్చారు. పోలవరం వల్ల భద్రాచలం నీట మునుగుతుందన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రం వద్ద కుండబద్దలు కొట్టారు.

ఇప్పుడు బీఆర్‌ఎస్‌ తో ఏపీలోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న కేసీఆర్‌ వీటన్నింటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానుల పల్లవిని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చింది. దీన్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుపై జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.

మరోవైపు జగన్‌ ఉగాది పండుగ తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తారని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. అమరావతి 21 గ్రామాలకు మాత్రమే పరిమితమని.. అది టీడీపీ రియల్‌ ఎస్టేట్‌ బ్యాచ్‌ రాజధాని అని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఏపీ రాజధానిపై ఎలా స్పందిస్తారు? ఏం మాట్లాడతారు? అనే దానిపై చర్చలు సాగుతున్నాయి.

విశాఖకు అనుకూలంగా మాట్లాడితే వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల వ్యతిరేకతను కేసీఆర్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగని అమరావతికి జైకొడితే తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నుంచి వ్యతిరేకత తప్పకపోవచ్చు. ఇలా కేసీఆర్‌ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్‌ విశాఖ సభతోనే దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.