Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ను ఏం చేస్తారు కేసీఆర్ సారూ..?

By:  Tupaki Desk   |   5 July 2022 7:15 AM GMT
బీఆర్ఎస్ ను ఏం చేస్తారు కేసీఆర్ సారూ..?
X
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిపాదన ఏమైంది..? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన ఎంతవరకు వచ్చింది..? అన్ని రాష్ట్రాల్లోని పార్టీలను కూడగట్టి బీఆర్ఎస్ తో కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టి, అవసరమైతే వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలన్న కార్యాచరణ ఎందాక వెళ్లింది..? ఈ ప్రశ్నలకు సమాధానం ఏక వాక్యంలో చెప్పాలంటే.. మొత్తమ్మీద ప్రస్తుతానికి బీఆర్ఎస్ ప్రతిపాదన అటకెక్కింది. అదేంటి..? ఆర్బాటంగా నాలుగైదు గంటల పాటు మంత్రులు, చాలామంది ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షలో ప్రతిపాదించిన బీఆర్ఎస్ కథ నెలలోనే ముగిసిందా? అంటే.. ముగియలేదు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కుపోయింది.

బీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్.. దూకుడు చూపిన బీజేపీ

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఏ క్షణాన ప్రకటించారో..? అసలే దూకుడు మీదున్న బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట పార్టీ మొత్తం తెలంగాణలో దిగిపోయింది. సాక్షాత్తు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సహా యూపీ సీఎం యోగి వంటి అతిరథ మహారథులు తెలంగాణకు వచ్చారు. అంతేకాదు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు పెద్ద కార్యాచరణనే ఏర్పాటు చేసుకున్నారు.

తెలంగాణలోని ప్రతి జిల్లాకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వెళ్లారు. అక్కడ బస చేశారు. మొత్తం మీద బీజేపీ పెద్ద హడావుడి లేపింది. సహజంగానే ఈ హంగామాలో బీజేపీ మీద ప్రజల ఫోకస్ పెరిగింది. వాస్తవానికి తెలంగాణలోని పరిస్థితులు రీత్యా బీజేపీకి మంచి అవకాశాలే ఉన్నాయి. కానీ, లౌకిక మంత్రంతో టీఆర్ఎస్ దానిని ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం బీజేపీ అతి దూకుడును చూసి ముందుగా ఇల్లు చక్కదిద్దాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇళ్లు.. పింఛన్లు.. ధరణి..

తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేసీఆర్ పదేపదే చెప్పేవారు. తొలి టర్మ్ లో దీనికి మంచి స్పందనే వచ్చింది. ఈసారి మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడాపెడా అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనికితోడు తెలంగాణ సర్కారు పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నిటికీ నిధులు కావాలంటే ఖజానా కళకళలాడాలి. కానీ, పరిస్థితుల రీత్యా నిధులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. పింఛన్లు మంజూరు ఆలస్యం అవుతోంది. కొత్త పింఛన్లు లేనే లేవు. అంతేకాక.. ఏడాదిన్నర కిందట తెచ్చిన ధరణి భూమి సమస్యలను మరింత అధికం చేసింది. శాసన సభ్యుల ధోరణితో ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ముందుగా వీటన్నిటినీ సరిచేసుకోవాలని.. ఆ తర్వాతే బీఆర్ఎస్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలకు సీఎం

జిల్లాల వారీగా చూస్తే.. టీఆర్ఎస్ లో గ్రూపులు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ కుమ్ములాటలు నెలకొన్నాయి. కొల్లాపూర్, తాండూరు వీటికి ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా చెప్పుకుంటూ పోతే 70 శాతం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కుమ్ములాటలను ఎదుర్కొంటోంది. వీటిని కూడా నివారించాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అందుకని ఈ నెల 20 నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా జిల్లాలకు వెళ్తారని చెబుతున్నారు. అంతేగాక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల వ్యవహార శైలితో 2 నుంచి 5 శాతం మేరకు పార్టీ ఓటింగ్‌కు నష్టం కలుగుతుందని ఉంది. కాగా, పార్టీలోని అత్యధిక శాతం ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాలు సకాలంలో అమలు కాకపోవడం తదితర కారణాలతోప్రజల్లో అసంతృప్తి పెరిగిందంటూ ప్రశాంత్‌ కిశోర్‌ బృందం సర్వేల్లో తేలింది.

ఈ నివేదికలను పరిశీలించాక.. సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కుతుందంటూ సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌ సంకేతాలిస్తూ వస్తున్నారు. అయితే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ ప్రకటించకముందే బీజేపీనే ఎదురుదాడికి దిగి కేసీఆర్‌ను లక్ష్యం చేసుకుంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లోనూ బీఆర్‌ఎస్‌ పట్ల ఒక రకమైన గందరగోళం, భయాందోళనలూ ఏర్పడ్డాయని టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పాగా వేయడానికి చర్యలు వేగిరం చేయడమూ కేసీఆర్‌ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ ప్రతిపాదనను పక్కన పెట్టి.. సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారని అంటున్నారు.