Begin typing your search above and press return to search.

ట్రంప్ సుప్రీంకు వెళితే ఏమవుతుంది? బుష్ జూనియర్ కేసు ఏమైంది?

By:  Tupaki Desk   |   5 Nov 2020 3:00 AM GMT
ట్రంప్ సుప్రీంకు వెళితే ఏమవుతుంది? బుష్ జూనియర్ కేసు ఏమైంది?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న వేళ.. ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని దేశాధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. ఆయన నోటి నుంచి ఎందుకీ మాటలు వచ్చాయి? ఆయనేం కోరుకుంటున్నారు? బుష్ జూనియర్ ఉదంతంలో ఏం జరిగింది? రెండోసారి బుష్ దేశాధ్యక్షుడు కావటానికి సుప్రీంలో కేసు వేయటమే కారణమా? అసలు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ట్రంప్ ఎందుకు అంటున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

గతానికి భిన్నంగా ఈసారి పోస్టల్-ఎర్లీ ఓటింగ్ కింద భారీగా ఓట్లు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం నాటి ఓటింగ్ పూర్తి అయ్యాక కూడా ఓట్లను స్వీకరించటానికి అవకాశం ఉంది. ఇది సరికాదన్నది ట్రంప్ వాదన. ఈ నిబంధనను నిలిపివేయాలని రిపబ్లిక్ పార్టీ మొదట్నించి కోరుతోంది. డెమొక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధన కారణంగా తమకు వ్యతిరేక తీర్పు వస్తుందన్న ఆందోళన ఉంది.

పెన్సిల్వేనియాలో మంగళవారం తర్వాత ఓట్లు భారీగా వచ్చి చేరుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో పోస్టల్ ఓట్లను వేసిన తర్వాత మార్పులు.. చేర్పులకు అవకాశం ఉందన్న ఆరోపణ ఉంది. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రంప్ భారీ మెజార్టీతో ఉన్నారు. కానీ..ఇంకా పది లక్షల పోస్టల్ ఓట్లు లెక్కించాల్సి ఉంది. భారీ మెజార్టీకి అవకాశం ఉన్న ఈ ఓట్లను జాగ్రత్తగా లెక్కిస్తామని.. తొందరపడకుండా వ్యవహరిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. ఈ గవర్నర్ ట్రంప్ కు వ్యతిరేకమైన డెమొక్రాట్ల పార్టీకి చెందిన వాడు. మనకు మాదిరి గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదు. విపరీతమైన అధికారాలు ఉంటాయి. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన వాడు.

అలాంటి వారు తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తారన్న భయం ట్రంప్ కు ఉంది. అదే సమయంలో స్థానిక కోర్టుల్ని ఆశ్రయించి.. దశల వారీగా సుప్రీంకు వెళితే తీర్పు ఆలస్యమవుతుంది కాబట్టి.. నేరుగా సుప్రీంను ఆశ్రయిద్దామన్నది ట్రంప్ ఆలోచనగా చెబుతారు. దీనికి తోడు సుప్రీంజడ్జిలు ఇద్దరిని ఈ మధ్యనే ట్రంప్ నియమించారు కాబట్టి.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందన్న ఉద్దేశంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారన్న వాదన జోరుగా వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే.. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ తేదీ తర్వాత పోస్టల్ ఓట్లను అంగీకరించాలన్న వినతిని సుప్రీంకోర్టు నో చెప్పింది. 2000లలో జార్జిబుష్ జూనియర్ దేశాధ్యక్షుడిగా ఎంపిక కావటంలో సుప్రీం కీలకంగా వ్యవహరించింది. అందుకే.. సుప్రీంను ఆశ్రయిస్తామని ట్రంప్ చెబుతున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ బుష్ జూనియర్ కేసు ఏమిటి? నాటి పలితం ఏమైందన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున జార్జి బుష్ జూనియర్.. డెమొక్రాట్ల అభ్యర్థిగా అల్ గోరెలు తలపడ్డారు. తొలుత బుష్ ను అధిక్యత వరించగా.. కౌంటింగ్ సాగిన కొద్దీ బుష్ అధిక్యం గణనీయంగా తగ్గటం మొదైలంది. దీంతో అల్ గోరె.. ఫ్లోరిడాతో సహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేవారు. ఆక్రమంలో రెండు పార్టీలు కోర్టును ఆశ్రయించాయి.

నవంబరు 3న పోలింగ్ జరిగితే.. డిసెంబరు 12 వరకు ఫలితం తేలలేదు. చివరకు అమెరికా సుప్రీంకోర్టు ఫ్లోరిడా కౌంటింగ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవటంతో బుష్ జూనియర్ దేశాధ్యక్షుడు అయ్యారు. నాటి ఫ్లోరిడాలాంటి రాష్ట్రాలు ఈసారి చాలానే ఉన్నాయని.. అందుకే ముందస్తు జాగ్రత్తగా ట్రంప్ సుప్రీంను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారేం జరుగుతుందో చూడాలి.