Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టు ‘పవర్’ కేంద్రానికి వెళితే ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   16 July 2021 3:39 AM GMT
తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టు ‘పవర్’ కేంద్రానికి వెళితే ఏమవుతుంది?
X
పిల్లిపోరు పిట్ట తీర్చినట్లుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జల పంచాయితీ ఇప్పుడు కేంద్రం కోర్టులోకి వెళ్లటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూర్చున్నా.. ఫోన్ లో మాట్లాడుకున్నా ఇష్యూ ఇంత వరకు వచ్చేది కాదు. అయినప్పటికీ.. ఆ విషయాన్ని ఎవరు ముందుగా మొదలు పెట్టాలన్న అంశం దగ్గరే ఆగిపోయింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించాలని.. రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా సిబ్బంది కాకుండా కేంద్ర బలగాలు మొహరించాలని ఏపీ సర్కారు మొదట్నించి కోరుకుంటోంది. అందుకు తెలంగాణ మాత్రం నో అంటే నో చెప్పేస్తుంది.

ఎందుకిలా అంటే.. తెలంగాణ చూపిస్తున్న కారణం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జలాల కేటాయింపు వివాదం తేలకుండా బోర్డులకు ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తారని రాష్ట్రం ప్రశ్నిస్తోంది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే ఉందని, జలాల కేటాయింపు ఫైనల్‌ కాకుండా ఏ విధంగా అప్పగిస్తారనేది కేసీఆర్ సర్కారు వాదన. జలాల కేటాయింపు లెక్క తేలకుండా.. నీటి విడుదలపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని పరశ్నిస్తోంది. అందుకే.. ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే అంశంపై మోడీ సర్కరు నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

ఇంతకీ కేంద్రానికి అప్పగించే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పష్టత రావటం లేదు. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులపై వివాదం తీవ్రస్థాయిలో నడుస్తోందన్న విషయం తెలిసిందే. వీటి పరిధిలోని పది ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగిస్తారా? లేక వివాదం నెలకొని ఉన్న శ్రీశైలం.. సాగర్.. పులిచింతల ప్రాజెక్టులను మాత్రమే బోర్డుకు అప్పగిస్తారా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. క్రిష్ణా జలాలపై వివాదం ఉంది కానీ గోదావరి నీటి మీద ఎలాంటి పంచాయితీ లేదు.

అయినప్పటికి భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని.. ఒకవేళ గోదావరి పై కట్టిన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. దేవాదుల నుంచి పోలవరం.. ధవళేశ్వరం ప్రాజెక్టులన్నింటిని కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకొన్న పక్షంలో తమ చేతిలోని అధికారాన్ని చేజేతులారా కేంద్రానికి అప్పగించినట్లేనని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాదాన్ని కేంద్రం కోర్టులో నెట్టటం ద్వారా ఏపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. తెలంగాణ వరకు మాత్రం ఈ పరిస్థితి ఆత్మరక్షణలో పడినట్లేనని చెప్పక తప్పదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ.. బలగాల మొహరింపు లాంటివి కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుందన్న విషయానికి వస్తే..

- బోర్డు ఇచ్చే ఉత్తర్వులను నిర్ణీత వ్యవధిలోగా అమలు చేయాల్సి ఉంటుంది.
- బోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. లేనిపక్షంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- నీటి లెక్కల్లో భాగంగా బోర్డు పరిధిలో లేని ప్రాజెక్టుల మీద కూడా కన్నేసి ఉంచుతుంది.
- కృష్ణా పరిధిలో మొత్తం 10 ప్రాజెక్టులు, వాటి పరిధిలోని 29 ఔట్‌లెట్‌లు ఉన్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు జూరాల, ఆర్డీఎస్‌, సుంకేసుల బ్యారేజీ, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, తుంగభద్ర హైలెవల్‌, లో లెవల్‌ కెనాల్స్‌, కృష్ణా నదిపై ఉన్న ఇతర అన్ని ప్రాజెక్టులు, వాటి పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లి.. వీటి ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లోను బోర్డే పర్యవేక్షిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల జోక్యం ఉండదు.
- గేట్లు, ప్రాజెక్టులతో పాటు విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి. దీనిపై పూర్తి పర్యవేక్షణ, అధికారం బోర్డుదే.
- ప్రాజెక్టుల ఆయకట్టు, నీళ్లు ఎంత కావాలో బోర్డులకు రాష్ట్రాలు సీజన్‌ల వారీగా అవసరాలు సమర్పించి.. ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ సీజన్‌లో నీటి అవసరాలను చెప్పాల్సిందే.
- ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు విడుదల చేస్తున్నారో రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇస్తుంది.
- ప్రాజెక్టుల కార్యకలాపాలు, నిర్వహణ ఖర్చులు తెలుగు రాష్ట్రాలు చెరి సగం భరించాలి.
- కాలువల ద్వారా విడుదలయ్యే నీటిని పక్కాగా లెక్కించేలా టెలిమెట్రీ పరికరాలు బిగించాల్సి ఉంటుంది.
- తన పరిధిలోని ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీటర్లు బిగించి పర్యవేక్షించే అధికారం బోర్డుకు ఉంటుంది.
- శ్రీశైలంలో ఎవరు ఎంత విద్యుత్‌ ఉత్పత్తి చేయాలో కేంద్రమే నిర్ణయించనుంది.
- రెండు రాష్ట్రాలు రాజీకి వస్తే జోక్యం చేసుకోదు.
- ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే ప్రతి నీటి చుక్కను టెలిమెట్రీ పరికరంతో లెక్కించనున్నారు.
- ఇందుకోసం పెట్టే ఖర్చును తెలుగు రాష్ట్రాలే భరించాలి.
- నీటి లెక్కలు పక్కాగా తీసేందుకు ఉద్దేశించిన పరికరాలకు దాదాపు రూ.18 కోట్ల దాకా అవుతుంది. టెలిమెట్రీ పరికరాలకు టెండర్లు, బిగింపు, అమల్లోకి తేవడం కూడా బోర్డు చూసుకుంటుంది.
- అన్ని ప్రాజెక్టులు, కాలువలపై సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు కాపలాగా ఉంటాయి. దీనికి అవసరమయ్యే నిధులను తెలుగు రాష్ట్రాలు భరించాలి.