Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన ‘శిరోముండనం’ కేసులో వివాదం ఎలా మొదలైంది?

By:  Tupaki Desk   |   22 July 2020 5:15 AM GMT
షాకింగ్ గా మారిన ‘శిరోముండనం’ కేసులో వివాదం ఎలా మొదలైంది?
X
అసలేం జరిగింది? అన్న లోతుల్లోకి వెళ్లకుండా.. ఒకట్రెండు విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఏదైనా ఒక ఉదంతంలో అసలేం జరిగిందన్నది చాలా కీలకం. ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చోటుచేసుకున్న తూర్పుగోదావరి జిల్లాలోని శిరోముండనం వ్యవహారానికి ముందు ఏం జరిగింది? అసలీ వివాదం ఎలా మొదలైందన్నది చూస్తే.. చాలా విషయాలు బయటకు వస్తాయి. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ ఉదంతానికి సంబంధించిన చాలా వివరాల్ని మీడియాలో వెల్లడించకుండా.. కేవలం శిరోముండనం చుట్టూనే తిప్పటం కనిపిస్తుంది.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే.. ఈ నెల 18 రాత్రి మునికూడలి గ్రామం వద్ద ఇసుక లారీ.. బైకు ఢీ కొన్న ఉదంతం చోటు చేసుకుంది. దీంతో బైకు నడుపుతున్న వ్యక్తి కాలు విరిగింది. స్థానికంగా ఉన్న కొందరు యువకులు లారీ ని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో కారులో అటుగా వచ్చారు మునికూడలి పంచాయితీ మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి. ట్రాఫిక్ నిలిచి పోయి ఇబ్బంది పడుతుండటం తో.. లారీని వదిలేయాలని చెప్పారు.

ప్రమాదానికి కారణమైన లారీని ఎలా వదిలేయాలని చెబుతారంటూ వాదన మొదలైంది. ఇది కాస్తా గొడవగా మారింది. మాజీ సర్పంచ్ భర్త తీరుపై ఆగ్రహానికి గురైన వారు కారు అద్దాల్ని పగలగొట్టారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పుష్కరం అనే వ్యక్తిని కొట్టారు.దీంతో.. గొడవకు దిగిన ఐదుగురు యువకులపై సీతానగరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

దీంతో ఇన్ చార్జ్ ఎస్సై ఫిరోజ్ షా నిందితుల్లో ఒకరైన ఇండుగుమిల్లి ప్రసాద్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా ట్రిమ్మర్ తెప్పించి.. అతడి గడ్డం.. మీసం..తలవెంట్రుకలు తొలగించి బయటకు పంపారు. ఈ వ్యవహారం వాట్సాప్ లో వైరల్ గా మారింది. దీంతో దళిత సంఘాలు రాజమహేంద్రవరం ఆర్బన్ ఎస్పీ బాజ్ పాయ్ వద్దకు తీసుకెళ్లాయి. ఈ ఉదంతాన్ని ఏపీ మంత్రులు సుచరిత.. ఆదిమూలపు సురేశ్ లు ఖండించారు. మంత్రి విశ్వరూప్ ఆసుపత్రిలో బాధితుడ్ని పరామర్శించారు. ఈ ఉదంతంపై సాయంత్రానికి ముఖ్యమంత్రి సీరియస్ కావటంతో పాటు.. ఈ మొత్తం ఉదంతం పై విచారణకు ఆదేశించారు. యువకుడి పై అనుచితం గా వ్యవహరించిన ఎస్సై ను అరెస్టు చేయటం తో పాటు కేసు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన కానిస్టేబుళ్ల పైనా కేసు పెట్టారు.