Begin typing your search above and press return to search.

జూనియర్ విషయంలో టీడీపీ ఏం చేయబోతోంది...?

By:  Tupaki Desk   |   25 Aug 2022 12:30 AM GMT
జూనియర్ విషయంలో టీడీపీ ఏం చేయబోతోంది...?
X
తెలుగుదేశం పార్టీకి ఇపుడు ఒక బిగ్ ట్రబుల్ వచ్చిపడింది. బీజేపీ బడా నేత అమిత్ షా హైదరాబాద్ కి వచ్చి కావాలని చేశారా లేక మరోటా అన్నది తెలియదు కానీ జూనియర్ తో భేటీ కావడం అన్నది ఆ పార్టీ వరకూ ఒకే కానీ అది ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా టీడీపీలో అతి పెద్ద తుఫాన్నే సృష్టిస్తోంది. నిజానికి టీడీపీ పరిస్థితి చూస్తే ఇపుడు దారుణంగా ఉంది. పుట్టిన గడ్డ తెలంగాణాలో టీడీపీ దాదాపుగా అస్థిత్వాన్ని కోల్పోయింది. ఇక ఏపీలో గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి. మూడున్నరేళ్ళు అయినా అనుకున్న స్థాయిలో గ్రాఫ్ అయితే పెరగడంలేదు.

టీడీపీలో చంద్రబాబు ఇమేజ్ మీదనే వచ్చే ఎన్నికల్లో పందెం కాయాల్సిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ ని వారసుడిగా చూపిస్తున్నా పార్టీ జనాలకే పెద్దగా ఎక్కడంలేదు. మరో వైపు టీడీపీకి యువ రక్తం కావాలని, గ్లామర్ కావాలన్న డిమాండ్ కూడా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ని పార్టీలోకి తీసుకురండి అని నేరుగా క్యాడరే కోరుతున్న నేపధ్యం ఉంది.

వాస్తవానికి టీడీపీలో జూనియర్ పాత్ర ఏమిటి, ఆయన హోదా ఏమిటి అన్నది పక్కన పెడితే ఈ రోజుకీ టీడీపీలోని అత్యధిక శాతం క్యాడర్ అయితే జూనియర్ తమవాడే అని నమ్ముతారు. జూనియర్ ఎప్పటికైనా టీడీపీ కోసం పనిచెస్తారని ఆ రోజు రావాలని కోకుకునే వారు కోకొల్లలుగా ఆ పార్టీలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఆలోచనలు అయితే జూనియర్ ని తెస్తే నారా లోకేష్ కి ఇబ్బంది అవుతుంది అన్న దగ్గరే ఆగిపోయాయని ప్రచారం కూడా ఉంది.

ఇలా జూనియర్ విషయంలో అధినాయకత్వం ఒకలా ఆలోచిస్తూంటే క్యాడర్ మరోలా రెస్పాండ్ అవుతోంది. ఈ తర్జనభర్జన సాగుతూండగానే అమిత్ షా వచ్చి జూనియర్ తో భేటీ పెట్టి టీడీపీని బాగానే కెలికారు అనే అంటున్నారు. మరి ఇది కూడా కాషాయ పార్టీలో వ్యూహమేమో అనుకోవాలి. లేకపోతే తన మానాన తాను జూనియర్ సినిమాలు చేసుకుంటున్నాడు, మరో వైపు టీడీపీ జూనియర్ విషయంలో ఎన్నికల ముందు ఆలోచిద్దామని, అప్పటికి అవసరం పడితే ప్రచారం కోసం పిలుచుకుని వద్దామన్న ప్లాన్ తో ఉందని అంటున్నారు.

అయితే ఇపుడు అమిత్ షా జూనియర్ తో కలవడంతో కొంపదీసి జూనియర్ బీజేపీ బాట పడతాడా అన్న కంగారు అయితే టీడీపీ తమ్ముళ్ళలో ఉందిట. వారు జూనియర్ ఎప్పటికీ టీడీపీ సొత్తు, ఆయన పసుపు పార్టీ సొంతం అని కూడా గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇపుడు క్యాడర్ నుంచి పార్టీ పెద్దల మీద వత్తిడి బాగా పెరుగుతోంది అంటున్నారు. అలా పెరగాలనే జూనియర్ ని అమిత్ షా దగ్గరకు పిలిపించుకున్నారా అన్నది కూడా ఇక్కడ చూడాలి.

ఏదైతేనేమి జూనియర్ విషయంలో ఇపుడు టీడీపీలో టాప్ టూ బాటం చర్చ సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఇన్ని రకాలుగా ఇబ్బందులో ఉంటే జూనియర్ ని పార్టీ కలుపుకోకుండా ఉండడమేంటి అన్న మాట పార్టీ పెద్దల నుంచి కూడా వస్తోందిట. ఇది కీలకమైన టైమ్. జూనియర్ టీడీపీ వారే అని చెప్పడానికి ఆయన్ని పిలిచి పార్టీలో పెద్ద పీట వేయాలని ఇపుడు సీనియర్ నాయకులు కూడా కోరుతున్నారని అంటున్నారు.

జూనియర్ వంటి చరిష్మటిక్ లీడర్ ని అలా వదిలేయకుండా పార్టీ కోసం వాడుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే జూనియర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇస్తే ఆయన కూడా కమిటెడ్ గా పార్టీ కోసం పనిచేస్తారు అన్న సూచనలు కూడా వస్తున్నాయట. జూనియర్ తాత ఎన్టీయార్ బ్లడ్ అని ఆయన కనుక టీడీపీకి దన్నుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటున్నారు. జూనియర్ వంటి గ్లామరస్ ఫిగర్ ని బీజేపీ తన వైపునకు తిప్పుకోవాలని చూస్తే టీడీపీ చూస్తూ ఊరుకోవడం ఏమీ బాగాలేదని ఆ పార్టీ హితైషులు కూడా అంటున్నారు.

అయితే జూనియర్ విషయంలో హై కమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది అని అంటున్నారు. జూనియర్ కి ఏ పదవీ ఇవ్వకుండా ఉత్తగా ప్రచారం చేయమంటే చేయరు. పైగా బీజేపీ పెద్ద అమిత్ షా వంటి వారే పెద్ద పీట వేసి ఆయన రాజకీయ ఆశలకు ఊపిరి పోస్తున్న దశలో జూనియర్ సరైన పొజిషన్ లేకుండా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వరని అంటున్నారు. జూనియర్ తీరు చూస్తే చంద్రబాబు వరకూ ఓకే కానీ ఆ తరువాత అయినా పార్టీ పగ్గాలు నందమూరి ఫ్యామిలీకి దక్కాలన్న ఆలోచన ఉందని అంటున్నారు.

మొత్తానికి జూనియర్ విషయంలో ఇపుడు టీడీపీ తర్జన భర్జన జరుగుతోంది. మరి జూనియర్ అవసరాన్ని గుర్తించి ఆయనకు కీలకమైన పదవి ఏదైఅనా పార్టీ ఇస్తుందా. ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. పైగా ఇపుడు టీడీపీకి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఈ విధంగా కనుక ఆలోచిస్తే టీడీపీలో రానున్న రోజుల్లో కీలకమైన పరిణామాలే జరుగుతాయని అంటున్నారు.