Begin typing your search above and press return to search.

ఇదేంది శ్రీధర్ బాబు ఇలా చేశావ్? రాహుల్ ‘ఫైర్’ను ‘ఫ్లవర్’ చేశావేంది?

By:  Tupaki Desk   |   7 May 2022 3:28 AM GMT
ఇదేంది శ్రీధర్ బాబు ఇలా చేశావ్? రాహుల్ ‘ఫైర్’ను ‘ఫ్లవర్’ చేశావేంది?
X
స్థానిక బాషలో మాట్లాడలేని జాతీయ నేతలు రాష్ట్రాల్ని సందర్శించే వేళలో ఒక సమస్య తరచూ ఎదురవుతుంటుంది. జాతీయ నేతలు చెప్పే మాటల్నియథాతధంగా.. అంతే సూటిగా.. స్పష్టంగా.. వారి భావోద్వేగాన్ని యథాతధంగా క్యారీ చేసి.. వారి సందేశాన్నిస్థానిక బాషలో అనువాదం చేసి చెప్పటం అనువాదకుడి బాధ్యత. తాజాగా వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తర్జుమా చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమ్ మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూర్తి స్థాయిలో చెడగొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక చక్కటి సినిమాను డబ్ చేసేటప్పుడు.. అనువాదం పక్కాగా ఉండాలి. దాని ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్ అస్సలు మిస్ కాకూడదు. అలా జరిగితే మొదటికే మోసం వస్తుంది. తాజాగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ మాటలు భగభగ మండే నిప్పు కణికల మాదిరి ఉన్నాయి.

మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాడ్ లక్ ఏమంటే.. అంతటి ఫైరింగ్ వ్యాఖ్యల్ని యథాతధంగా ప్రజలకు చెప్పే విషయంలో శ్రీధర్ బాబు పాస్ కూడా కాలేదనే చెప్పాలి.

బాగా చదువుకున్న వాడు.. మంచి వక్తగా పేరున్న శ్రీధర్ బాబు.. రాహుల్ ప్రసంగాన్ని అనువాదం చేసే విషయంలో మాత్రం అడ్డంగా ఫెయిల్ అయ్యారనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నియంతగా.. రాజుగా పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు.. పొత్తు విషయంపై కాంగ్రెస అధినాయకత్వం ఎంత క్లారిటీగా ఉందన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. లక్కీగా తెలంగాణ రాష్ట్రంలో అందరికి కాకున్నా.. చాలామంది హిందీని అర్థం చేసుకుంటారు.

ఈ కారణంగానే బహిరంగ సభలో రాహుల్ నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలకు.. ఆయన మాట్లాడుతున్నప్పుడే స్పందన రాగా.. దాన్ని శ్రీధర్ బాబు తెలుగులో అనువాదం చేసినప్పుడు అంతగా రియాక్షన్ లేకపోవటానికి కారణం.. రాహుల్ మాటల్లోని ఫైరింగ్ ను అనువదించే విషయంలో శ్రీధర్ బాబు ఫెయిల్ కావటమే.

రాహుల్ స్పీచ్ ను అనువదించే విషయంలో శ్రీధర్ బాబు.. ఫైర్ ను ఫ్లవర్ లా ప్రజంట్ చేశారని చెప్పాలి. ఈసారికి ఓకే.. తర్వాతి సభలో అయినా సరే.. సరైన అనువాదకుడ్ని కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.