Begin typing your search above and press return to search.

కేంద్రంలో కొలువు తీరేది ఎవ‌రు? కేసీఆర్ రిపోర్టులు ఏం చెబుతున్నాయ్?

By:  Tupaki Desk   |   9 May 2019 4:30 AM GMT
కేంద్రంలో కొలువు తీరేది ఎవ‌రు?  కేసీఆర్ రిపోర్టులు ఏం చెబుతున్నాయ్?
X
ఏం జ‌ర‌గ‌నుంద‌న్న అంచ‌నా వేయ‌టం అంద‌రికి చేత‌కాదు. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఫెయిల్ కాలేద‌నే చెప్పాలి. ఆయ‌న దృష్టి సారించి.. సంగ‌తి చూద్దామ‌న్న‌ట్లుగా కూర్చుంటే.. ఆయ‌న‌కు మించిన విశ్లేష‌ణ మ‌రెవ‌రూ చేయ‌లేర‌నే చెప్పాలి. ఫ‌లితంపై అంచ‌నా వేయ‌టంలో కేసీఆర్ సామ‌ర్థ్యం అంతా ఇంతా కాదు. డిసెంబ‌రులో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ మొద‌ట్నించి త‌న‌కొచ్చే సీట్ల లెక్క‌ను చెబుతూనే ఉన్నారు.

ఆయ‌న చెప్పిన‌ట్లుగా 110 సీట్లు రాకున్నా.. వంద వ‌ర‌కూ వ‌స్తాయ‌న్న మాట‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేదు. కేసీఆర్ మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో ఉన్నార‌ని.. ఆయ‌న‌కు షాక్ త‌ప్ప‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది. ఆ మాట‌కువ‌స్తే.. టీఆర్ఎస్ నేత‌లు ప‌లువురు సైతం కేసీఆర్ అంచ‌నాలు త‌ప్పుతాయ‌న్న మాట మాట్లాడిన వారే. అయితే.. అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌క్రిందులు చేస్తూ కేసీఆర్ చెప్పిన‌ట్లే తుది ఫ‌లితాలు రావ‌టం మాత్రం గొప్ప విష‌యంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తాము 16 ఎంపీ స్థానాల్ని కైవ‌శం చేసుకుంటార‌న్న ఒక అంచ‌నాతో పాటు.. ఏపీలో జ‌గ‌న్ కు అధికారం ఖాయ‌మ‌న్న మాట‌ను కేసీఆర్ చెబుతున్నారు. త‌న‌కున్న రిపోర్ట‌ల ప్ర‌కారం ఏపీలో గెలుపు జ‌గ‌న్ దే అన్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు కేసీఆర్ త‌న మాట‌ల్లో స్ప‌స్టం చేశారు.

మ‌రి.. కేంద్రంలో ప‌వ‌ర్ ఎవ‌రిద‌న్న విష‌యం మీద మాత్రం ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొన్న‌టివ‌ర‌కూ మోడీకే మ‌ళ్లీ ప‌వ‌ర్ అన్న‌ట్లుగా ఉన్న కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అంచ‌నాలు వేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఓట‌రు మూడ్ కు సంబంధించి సారు వారు చేయించిన స‌ర్వే రిపోర్టులు ఇప్ప‌టికే కేసీఆర్ చేతికి అందిన‌ట్లుగా స‌మాచారం. తాజాగా ఆయ‌న వేసుకున్న లెక్క‌ల ప్ర‌కారం మోడీ మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న భావ‌న‌కు ఆయ‌న వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

మోడీ వ్య‌తిరేక ప‌వ‌నాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని.. సొంతంగా కానీ మిత్రుల‌తో క‌లిసి కాని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్తితి మోడీకి లేద‌నే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దేశంలో ప్రాంతీయ‌పార్టీలు హ‌వా చూపిస్తాయ‌ని.. కాంగ్రెస్ కాస్త పుంజుకున్నా.. మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారంతోనే ఆ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వీలున్న‌ట్లుగా కేసీఆర్ అంచ‌నాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ కార‌ణంతోనే మోడీ మీద త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో విరుచుకుప‌డిన కేసీఆర్‌.. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీని ఉద్దేశించి ఒక్క విమ‌ర్శ చేయ‌క‌పోవ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకొనే సోనియాను ఒక్క మాట అన‌లేద‌ని.. రేపొద్దున ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ స‌హ‌కారం అవ‌స‌ర‌మైనా.. అందుకు త‌గ్గ‌ట్లు వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేసుకునే క్ర‌మంలో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. ఈ విష‌యంలో కేసీఆర్ అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో చూడాలి.