Begin typing your search above and press return to search.

చైనాలో అస‌లు ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   26 Sep 2022 4:07 AM GMT
చైనాలో అస‌లు ఏం జ‌రుగుతోంది?
X
చైనాలో ఏం జ‌రుగుతోంది.. ప్ర‌పంచ దేశాల‌న్నింటిలోనూ ఇప్పుడు ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఓవైపు అగ్ర రాజ్యం హోదా కోసం అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న చైనాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల ప్ర‌పంచ దేశాలన్నీ ఆసక్తి చూపుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాల‌తో క‌య్యానికి కాలుదువ్వుతూ.. విప‌రీత‌మైన సామ్రాజ్య‌వాద కాంక్ష‌తో రంకెలేస్తున్న చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ‌నిర్భంధంలో ఉంచార‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ మేర‌కు చైనా సైన్యం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుంద‌ని.. గృహ నిర్భంధానికి గురి చేసింద‌నే వార్త వైర‌ల్ అవుతోంది.

ఇటీవ‌ల ఉజ్బెకిస్థాన్‌లో జ‌రిగిన షాంగై కోఆప‌రేష‌న్ స‌ద‌స్సులో పాల్గొన్నారు.. జీ జిన్‌పింగ్. ఓవైపు చైనా క‌మ్యూనిస్టు పార్టీ అధినేత‌గా.. ఆ దేశ అధ్య‌క్షుడిగా, చైనా సైన్యం పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) స‌ర్వ‌సైన్యాధ్య‌క్షుడిగా ఇలా పెక్కు బాధ్య‌త‌ల్లో కొన‌సాగుతున్నారు.. జీ జిన్‌పింగ్‌. అంతేకాకుండా ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన నేత‌ల్లో ఒక‌రిగానూ ఉన్నారు. అలాంటి జీ జిన్ పింగ్‌ను ఉజ్బెకిస్థాన్ నుంచి రాగానే చైనా సైన్యం అదుపులోకి తీసుకుని ఆయ‌న‌ను గృహ నిర్బంధం చేసింద‌ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

జీ జిన్‌పింగ్‌ను అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి, పీఎల్ఏ బాధ్య‌త‌ల నుంచి జిన్‌పింగ్‌ను సైన్యం తొల‌గించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చైనా అధ్యక్షుడిగా సైనికాధికారి లీ కియావోమింగ్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మ‌రోవైపు చైనా నుంచి విదేశాల‌కు వెళ్లాల్సిన విమానాల్లో ఏకంగా 60 శాతం విమానాల‌ను ర‌ద్దు చేశార‌ని అంటున్నారు. అంతేకాకుండా దాదాపు ప‌ది వేల దేశీయ‌, విదేశీ విమానాలు ఆగిపోయాయ‌ని చెబుతున్నారు. ఆ దేశంలో మెట్రో రైళ్ల‌ను సైతం ఆపివేశార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో చైనాలో ఏదో జ‌రుగుతోంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

చైనా రాజ‌ధాని న‌గ‌రం బీజింగ్ నుంచి విమానాల రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయ‌ని అంటున్నారు. బ‌య‌టి ప్ర‌పంచంతో బీజింగ్ న‌గ‌రానికి సంబంధాలు తెగిపోయాయ‌నే ప్ర‌చారం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో ప‌లు ప్ర‌పంచ దేశాల నేత‌లు చైనాలో ఏం జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ‌రోవైపు ఉప‌గ్ర‌హ చిత్రాలంటూ కొన్ని చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చైనా సైన్యానికి చెందిన భారీ కాన్వాయ్ దేశ రాజ‌ధాని బీజింగ్ వైపు సాగుతోంద‌ని అంటున్నారు. 80 కిలోమీట్ల‌ర పొడ‌వునా ఈ సైనిక వాహ‌నాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. విదేశాల్లో ఉంటున్న చైనా మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జెన్నిఫ‌ర్ జెంగ్ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో దృశ్యాల‌తో ప్ర‌పంచ దేశాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి.

అలాగే చైనాలో భారీగా మంటలు, పొగ వెలువ‌డ‌టాన్ని చూపిస్తున్న ఓ వీడియోను అమెరికాలో ఉంటున్న చైనా రచయిత గోర్డన్‌ చాంగ్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని బ‌ట్టి చైనా ఇప్పుడు ప్ర‌శాంతంగా లేద‌ని.. అక్క‌డ ఏదో జ‌రుగుతోంద‌ని ఆయ‌న అంటున్నారు.

కాగా ఇటీవ‌ల ఉజ్బెకిస్థాన్ లో షాంగై కోఆప‌రేష‌న్ స‌మావేశాల‌కు జీ జిన్ పింగ్ హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశాల‌కు భార‌త్ ప్ర‌ధాని నరేంద్ర మోడీ, ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్ర‌ధాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అక్క‌డ నుంచి జిన్ పింగ్ స్వ‌దేశానికి రాగానే ఆయ‌నను చైనా సైన్యం అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.