Begin typing your search above and press return to search.

ఆ గంట‌న్న‌ర‌!..అంతా ఏపీ పాలిటిక్స్‌ పైనే చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   27 Jan 2019 12:09 PM GMT
ఆ గంట‌న్న‌ర‌!..అంతా ఏపీ పాలిటిక్స్‌ పైనే చ‌ర్చ‌!
X
నిన్న భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వర్న‌ర్ హోదాలో ఈఎస్ ఎల్ న‌ర‌సింహన్ హైద‌రాబాదులోని రాజ్ భ‌వ‌న్‌ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం విందు ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌కు కేంద్రంగా మారింది. ఈ విందుకు ఏపీ నుంచి సీఎం చంద్ర‌బాబు గానీ, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గానీ హాజ‌రు కాలేదు. అయితే ఏపీ అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం హాజ‌ర‌య్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లు కూడా ఈ విందుకు హాజ‌రైనా... అక్క‌డ మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలిచారు. దాదాపుగా రెండు గంట‌ల‌కు పైగానే జ‌రిగిన ఈ విందులో కేసీఆర్ దాదాపు గంట‌న్న‌ర‌కు పైగానే ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ గంట పాటు ఉన్నారు. కేటీఆర్ కూడా కేసీఆర్ ఉన్నంత సేపూ అక్క‌డే గ‌డిపారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌, కేటీఆర్ ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ వేర్వేరుగా జ‌రిపిన ముచ్చ‌ట్లు ఆస‌క్తి రేకెత్తించాయి. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌ తో కేసీఆర్ జ‌రిపిన అంత‌రంగిక చ‌ర్చ‌లు మ‌రింత ఆస‌క్తి రేకెత్తించాయి. ప‌వ‌న్‌ తో ముచ్చ‌ట్ల సంద‌ర్భంగా అటు కేసీఆర్‌ తో పాటుగా ఇటు కేటీఆర్ కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చించిన‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయి? ఏపీ ప్ర‌భావం ఏమిటి? అన్న‌దానిపై కూడా వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రినిగిన‌ట్గుగా తెలుస్తోంది. జ‌గ‌న్ తో ఇటీవ‌ల కేటీఆర్ క‌లిసిన సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసిన ప‌వ‌న్‌... ఈ ద‌ఫా మాత్రం కేసీఆర్‌, కేటీఆర్‌ తో బాగా క‌లిసిపోయి... ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీల ప‌రిస్థితితో పాటు జ‌న‌సేన పోటీ, ప్ర‌జ‌ల స్పంద‌న‌, గెలుపు అవ‌కాశాలు ఉన్న పార్టీలేవి? ఆయా పార్టీల‌కు ఉన్న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు, అంతిమంగా విజ‌యం ఎవ‌రిని వరించ‌నుంద‌న్న విష‌యాల‌పై వీరు కాస్తంత లోతుగానే చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం. ఇక ప‌వ‌న్ వెళ్లిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌ తో కేసీఆర్ చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ చ‌ర్చ‌ల్లోనూ ప్ర‌ధానంగా ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లే కీల‌కంగా మారిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా తెలంగాణ గ‌డ్డ‌పై జ‌రిగిన ఈ కీల‌క చ‌ర్చ‌ల్లో ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు, ఏపీ రాజ‌కీయాలు కీల‌కంగా మార‌డం గ‌మ‌నార్హం.