Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టును నుపుర్ శర్మ కోరింది ఇదే!

By:  Tupaki Desk   |   1 July 2022 7:32 AM GMT
సుప్రీంకోర్టును నుపుర్ శర్మ కోరింది ఇదే!
X
ఓ టీవీ డిబేట్​లో మహమ్మద్​ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ బ‌హిహ్కృత నేత నుపుర్ శ‌ర్మ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా న‌మోదైన ఫిర్యాదుల‌న్నింటిని విచార‌ణ కోసం ఢిల్లీకి బ‌దిలీ చేయాల‌ని ఆమె విన్న‌వించారు. మ‌రోవైపు ఇప్ప‌టికీ త‌న‌ను, త‌న కుటుంబ స‌భ్యుల‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల వ‌ల్లే రాజ‌స్థాన్ లోని ఉద‌య‌పూర్ లో టైల‌ర్ ను దుండ‌గులు హ‌త్య చేశార‌ని పేర్కొంది. ఇప్ప‌టికైనా నుపుర్ శ‌ర్మ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆదేశించింది. బీజేపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నంత మాత్రాన ఏది ప‌డితే అది మాట్లాడ‌డానికి అనుమ‌తి ఉన్న‌ట్టు కాద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కాగా జూన్ మొద‌టి వారంలో ఒక టీవీ చానెల్ డిబేట్ లో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న నుపుర్ శ‌ర్మ‌ అభ్యంత‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. మ‌రోవైపు నుపుర్​ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు భగ్గుమన్నాయి.

దేశంలోని ప్ర‌తిపక్షాలతో పాటు గల్ఫ్​ దేశాలు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. సౌదీ అరేబియా, ఖతార్​, కువైట్​, ఇరాన్​ త‌దిత‌ర‌ దేశాలు.. భారత రాయబారులకు సమన్లు జారీ చేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి. అంతేకాకుండా.. గల్ఫ్​ దేశాల్లో భారత వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు కూడా ఎక్కువ‌య్యాయి.

మ‌రోవైపు ముస్లిం చాంద‌స‌వాధ సంస్థ‌లు, ఉగ్ర‌వాద సంస్థ‌లు ఆమెను చంపుతామ‌ని బెదిరింపుల‌కు దిగాయి. దీంతో పోలీసులు ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇప్ప‌టికే నుపుర్ శర్మ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపార‌ని రాజ‌స్థాన్ లోని ఉద‌య‌పూర్ లో ఒక టైల‌ర్ ను హ‌త్య చేశారు. నుపుర్ శర్మ తల నరికితే రూ. 1 కోటి బహుమానం ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన బీమ్ సేన్ చీఫ్ నవాబ్ స‌త్ప‌ల్ ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు.

కాగా నుపుర్​ శర్మ ఒక‌ న్యాయవాది. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి అమె సేవలందిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన నుపుర్ 2011లో లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​ నుంచి ఎల్​ఎల్​ఎం పొందారు. 2009-2010 మధ్య కాలంలో 'టీచ్​ ఫర్​ ఇండియా'కు అంబాసిడర్​గా కూడా పనిచేశారు. చదువుకునే రోజుల్లోనే.. నుపుర్​ శర్మ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 2008లో ఆమె రాజ‌కీయ జీవితం మొదలైంది. నాడు.. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్​ యూనియన్​ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. బీజేపీలోని యువజన విభాగంలో పని చేశారు. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​పై పోటీ చేసి ఓడిపోయారు.