Begin typing your search above and press return to search.

అంటీ ముట్టనట్లుగా అవంతి ... మ్యాటరేంటి...?

By:  Tupaki Desk   |   17 April 2023 5:00 AM GMT
అంటీ ముట్టనట్లుగా అవంతి ... మ్యాటరేంటి...?
X
వైసీపీలో మాజీ మంత్రి కీలక నేత అయిన అవంతి శ్రీనివాసరావు పార్టీతో పెద్దగా అంటీ ముట్టనట్లుగా ఉండడం పట్ల చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆయన్ని జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించేసి కొత్త వారికి అది ఇవ్వడం అసలు తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన తరువాత చాలా లేట్ గా వైసీపీలో చేరిన పంచకర్ల రమేష్ బాబుకు పెద్ద పీట వేయడం పట్ల రగులుతున్నారనే అంటున్నారు.

నిజానికి ఈ ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో పంచకర్ల పెందుర్తి నుంచి అవంతి భీమిలీ నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కాంగ్రెస్ అక్కడ నుంచి టీడీపీలో చేరారు. 2014లో అవంతి అనకాపల్లి ఎంపీ అయితే పంచకర్ల యలమంచిలి ఎమెల్యే అయ్యారు.

ఇక 2019లో చూస్తే పంచకర్ల కూడా వైసీపీలోకి రావాల్సిన వారే. కానీ చివరి నిముషంలో ఆగిపోయారు. అవంతి మాత్రం ముందే అన్ని మాట్లాడుకుని పార్టీ జెండా కప్పుకున్నారు. అనుకున్నట్లుగా వైసీపీ గెలవడం ఆయన మంత్రి కావడం జరిగిపోయాయి. ఈ నేపధ్యంలో మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన అవంతి మరో మాజీ అమంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు కానీ పంచకర్ల వైసీపీలో చేరడాన్ని మాత్రం బ్రేక్ వేయలేకపోయారు.

అయితే తాను మంత్రిగా ఉన్నంత కాలం ఏ రకంగా ప్రాధాన్యత దక్కకుండా చూసుకున్నారని అంటారు. ఇక మాజీ మంత్రి అయినా జిల్లా ప్రెసిడెంట్ పోస్ట్ దక్కింది కదా అని అవంతి సంతోషించారు. ఎన్నికల వేళ పార్టీ పదవి ఉంటే బహు మేలు అని భావించారు. కానీ ఆ పదవి మూడు నాళ్ళ ముచ్చట అయింది. పైగా పంచకర్లకు వైసీపీలో పెద్ద పీట వేయడం, ఆయనకే తనను పీకేసి మరీ జిల్లా ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడంతో అవంతి తట్టుకోలేకపోయారని అంటున్నారు.

దాంతో నాటి నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా పంచకర్ల అధ్యక్షతన జరిగే కార్యక్రమాలకు ఆయన బహు దూరం అన్నట్లుగా ఉంటున్నారు. వారం రోజుల పాటు వైసీపీ విశాఖ జిల్లాలో నిర్వహించిన పీపుల్స్ మాస్ సర్వే కార్యక్రమం విజయవంతం అయిందని చెబుతూ పంచకర్ల మీటింగ్ పెడితే దానికి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ అవంతి రాకపోవడం చర్చనీయాశం అయింది. అదొక్కటే కాదు చాలా సార్లు ఆయన ఇలాగే డుమ్మా కొడుతూ వస్తున్నారని అంటున్నారు.

తాను పార్టీ మారను, వైసీపీలోనే తన రాజకీయ జీవితం అని ఒక వైపు చెబుతున్నా కూడా అవంతి పోకడలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న అసంతృప్తి ఇవన్నీ చూసిన వారు మాత్రం ఆయన ఏమైనా చేయబోతారా అని చర్చించుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా తమకే మంత్రి పదవి దక్కాలని అవంతి భావిస్తున్న వేళ పోటీగా పంచకర్ల తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆయనతో కలసి పనిచేయడమే అవంతికి నచ్చడంలేదా అన్న చర్చ కూడా వస్తోంది. చిత్రమేంటి అంటే పార్టీ కూడా అవంతి విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ఉండడం అని అంటున్నారు.