Begin typing your search above and press return to search.

అప్పుడు గురువుకు పంగనామం.. ఇప్పుడు ఉక్కు మనిషికి ఎసరు

By:  Tupaki Desk   |   27 Feb 2021 1:30 PM GMT
అప్పుడు గురువుకు పంగనామం.. ఇప్పుడు ఉక్కు మనిషికి ఎసరు
X
ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం మరొకటి ఉండదు. అదే సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కు మించిన వినాసకారి మరేదీ ఉండదు. ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఓవర్ కాన్ఫిడెన్సు వారిని దెబ్బ తీస్తుంది. అన్ని తెలిసిన పెద్ద మనిషికి ఈ చిన్న విషయం తెలీదా? అన్నది ప్రశ్న. నిత్యం మేనేజ్ మెంట్ గురు మాదిరి మాట్లాడే ప్రధాని మోడీకి ఏమైంది? కింది స్థాయి నుంచి మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడు తిరుగులేని నేతగా మారటమే కాదు.. ఆయనకు మించిన శక్తివంతుడు దేశంలోనే లేడన్నది నిజం. అయితే.. ఇది ఇప్పటికి మాత్రమే.

తనకు లభించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవటమే కాదు.. రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అందుకు భిన్నంగా ఒంటెద్దు పోకడలకు పోవటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తుంది. తియ్యటి మాటలు చెప్పే మోడీకి.. ఆయన చేసే పనులకు సంబంధం లేదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయన్ను చేరదేసి.. ఈ రోజున ఈ స్థాయికి రావటానికి కారణమైన వారిలో ఆయన రాజకీయ గురువు అద్వానీని ఎవరూ కాదనలేరు. నాడు ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ కు కూడా మోడీ అంతగా నచ్చేవారు కాదు. కానీ.. అద్వానీ బలవంతంతో ఆయన మాట కాదనలేక మోడీని ఓకే చేశారన్నది వాస్తవం.

అలా తనకు దన్నుగా నిలిచిన అద్వానీకి ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ.. ఇప్పటివరకు ఏం చేశారన్న విషయం దేశ ప్రజలకు బాగానే తెలుసు. అన్నింటిలోనూ మోడీని సమర్థించిన వారు సైతం.. అద్వానీ ఇష్యూ వచ్చినంతనే మాత్రం మౌనముద్ర దాలుస్తారు. ఇది సరిపోనట్లుగా తాజాగా దేశ ఉక్కు మనిషిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్థానంలో మోడీ పేరును ఒక క్రికెట్ స్టేడియంకు పెట్టటంపై వివాదం చెలరేగుతోంది.

నిజానికి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే.. దాన్ని అడ్డుకోవాలే కానీ.. తానే అంగీకారం తెలిపినట్లుగా మోడీ వ్యవహరించిన తీరునుపలువురు తప్పు పడుతున్నారు. ప్రజల భావోద్వేగాలతో సంబంధం లేకుండా.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్న పట్టుదల మోడీలో ఎక్కువైందని.. అదే ఇప్పటి విపరీతంగా మారినట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో.. మోడీని మొదటి నుంచి వ్యతిరేకించేవారు తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించటం మొదలు పెట్టారు. మొదట గురువుకు పంగనామాలు పెట్టిన మోడీ.. తాజాగా దేశ ఉక్కుమనిషికి పంగనామం పెట్టిన చందంగా ఆయన పేరుతో ఉన్న విమానాశ్రయానికి తన పేరు పెట్టటాన్ని తప్పు పట్టాలి కదా? అందరితో వేలెత్తి చూపించుకోవటం ఎందుకు? కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి వివాదంతో మొదటికే మోసంగా మారుతుందేమో మోడీజీ?