Begin typing your search above and press return to search.

ఇదేం పిడి వాద‌న జ‌గ‌న్‌?!

By:  Tupaki Desk   |   21 Sep 2022 9:46 AM GMT
ఇదేం పిడి వాద‌న జ‌గ‌న్‌?!
X
విజ‌య‌వాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి పేరు మారుస్తూ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. పేరు మార్పు బిల్లుకు ఇప్ప‌టికే శాస‌న‌స‌భ ఆమోదం కూడా ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఇక విజ‌య‌వాడ‌లో డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు డాక్ట‌ర్‌ వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార‌నుంది.

హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి త‌న తండ్రి పేరు పెట్టుకోవ‌డాన్ని స‌మ‌ర్థిస్తూ జ‌గ‌న్ అసెంబ్లీలో చెప్పిన మాట‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీలో వైద్య విద్యలో స‌మూల మార్పులు చేసింది, కాలేజీలు పెంచింది తన తండ్రి వైఎస్సార్‌, తాను మాత్ర‌మేన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అందుకే యూనివ‌ర్సిటీకి త‌న తండ్రి పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డంలో తప్పేమీ ఉంద‌న్నారు.

ఇక్క‌డే జ‌గ‌న్ వాద‌న‌పై విశ్లేష‌కులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైఎస్సార్ వ‌చ్చే వ‌ర‌కు ఎంబీబీఎస్ కోర్సే లేద‌న్న‌ట్టు, ఇత‌ర వైద్య విద్యా కోర్సులే లేవ‌న్న‌ట్టు జ‌గ‌న్ వితండ వాదం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ పిడి వాద‌న త‌ప్ప మ‌రేమీ కాదంటున్నారు. తాము రాష్ట్రంలో 17 కాలేజీలు క‌డుతున్నామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నా.. వాటిలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌, నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ అనుమ‌తులు ఇచ్చింది కేవ‌లం మూడు కాలేజీల‌కే మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. ఇంకా క‌ట్ట‌ని కాలేజీల‌కు, క‌నీసం శంకుస్థాప‌న చేయ‌ని కాలేజీల‌ను కూడా ఇప్ప‌టి నుంచే క‌డుతున్నామ‌ని చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

కేంద్రం అనుమ‌తులు ఇచ్చిన మూడు వైద్య క‌ళాశాల‌ల్లో కూడా కేవ‌లం పులివెందుల‌లో మాత్ర‌మే కాలేజీకి పునాదుల ద‌శ దాటింద‌ని విద్యావేత్త‌లు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 11 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాలలు ఉన్నాయి. వీటిలో 8 టీడీపీ పుట్ట‌కముందే అంటే 1983కు ముందే ఉన్నాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. మ‌రో మూడు త‌న తండ్రి వైఎస్సార్ హ‌యాంలో నిర్మించార‌ని అంటున్నారు. ఇప్పుడు తాను మ‌రో 17 కాలేజీల‌ను క‌డుతున్నా అని జ‌గ‌న్ చెప్పారు. ఈ మొత్తం 28 కాలేజీల్లో 20 కాలేజీల‌ను తాను, త‌న తండ్రి క‌ట్టించిన‌వేన‌ని.. అందుకే త‌న తండ్రి వైఎస్సార్ పేరు యూనివ‌ర్సిటీకి పెడుతున్నామ‌ని తెలిపారు.

దీనిపైన తీవ్ర విమ‌ర్శ‌లు, అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది మూడు క‌ళాశాల‌ల‌నే. వాటిలో కూడా పులివెందుల కాలేజీ మాత్రమే నిర్మాణంలో ఉంది. మిగిలిన‌వాటికి క‌నీసం శంకుస్థాప‌న‌లు కూడా పూర్తి కాలేదు. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హాయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేద‌ని య‌థేచ్ఛ‌గా అసెంబ్లీ సాక్షిగా అబ‌ద్దాలు ఆడేశార‌ని అంటున్నారు.

ఇత‌రులు క‌ట్టించిన‌వాటిని, లేదా శంకుస్థాప‌న‌లు చేసిన‌వాటిని మ‌ళ్లీ ప్రారంభించ‌డం, మళ్లీ శంకుస్థాప‌న‌లు చేయ‌డం, త‌న హ‌యాంలోనే అవి వ‌చ్చాయ‌ని, లేదా త‌న తండ్రి హ‌యాంలోనే అవి ఏర్పాట‌య్యాయ‌ని జ‌నాల చెవిల్లో జ‌గ‌న్ క్యాబేజీలు పెడుతున్నార‌ని నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మొద‌లైన ఎన్నో ప్రాజెక్టుల‌కు మ‌ళ్లీ రిబ్బ‌న్లు క‌ట్టి ప్రారంభించ‌డం, గ‌త ప్ర‌భుత్వం శిలా ఫ‌ల‌కాలు వేసిన ప్రాజెక్టుల‌కే మ‌ళ్లీ శంకుస్థాప‌న‌లు, శిలాఫ‌ల‌కాలు వేయ‌డం కూడా ఇందులో భాగ‌మేన‌ని ఎద్దేవా చేస్తున్నారు.

మ‌ళ్లీపైగా ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో మమకారం ఉందని జ‌గ‌న్ చెప్పుకోవ‌డం వింత‌ల్లో వింత అని అంటున్నారు. చంద్రబాబు కంటే ఎన్టీఆర్ అంటే త‌న‌కు ఎక్కువ అభిమానం ఉందని జ‌గ‌న్ చెప్పుకోవ‌డం ఇందులో భాగ‌మేనంటున్నారు. యూనివ‌ర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకున్నానని ముందుకు వెళ్లాన‌ని జ‌గ‌న్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.