Begin typing your search above and press return to search.

తెలంగాణలో బీజేపీ గెలుపునకు దారేది?

By:  Tupaki Desk   |   29 Dec 2022 1:30 PM GMT
తెలంగాణలో బీజేపీ గెలుపునకు దారేది?
X
దేశమంతా బీజేపీకి గొప్ప బలం ఉండొచ్చు. కానీ దక్షిణాదిలో మాత్రం లేదు. కర్ణాటకలో తప్పితే మిగతా అన్నిరాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా.. అయితే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతోంది. అయితే ఆ పార్టీ క్షేత్రస్థాయి బలం చూస్తే మాత్రం గెలుపు అంత ఈ జీ కాదన్న విషయం ఇట్టే బోధపడుతోంది.

తెలంగాణ బీజేపీ ఇక్కడ గెలుపు కోసం తన అసలు బలాన్ని అంచనావేసే పనిలో పడింది. పార్టీ వ్యవహారాలు చూసుకునే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చి పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి 90 సీట్లు టార్గెట్ గా ఇచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తే.. అసలు 90 నియోజకవర్గాల్లో కనీసం 30 చోట్ల కూడా బలమైన అభ్యర్థులు లేనట్లుగా తేలింది.

దీంతో చేరికల కమిటీకి బీజేపీ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇతర పార్టీల్లో నియోజకవర్గ స్థాయిలో పట్టున్న నేతలను ఆకర్షించాలని స్పష్టం చేసింది. ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను బీజేపీకి లాగాలని.. తెలంగాణలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికీ బీజేపీలో చేరేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడంలేదని తెలిసింది.

అందుకే సీనియర్ నేతలకు టికెట్లపై భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఈ మేరకు చేరికల కమిటీకి సందేశం ఇచ్చారు. పార్టీలో చేరుతామని వచ్చే వారికి టిక్కెట్ హామీ ఇద్దామని.. ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతలతోనే చెప్పిద్దామని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానంగా బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ గా ఉంది. అందులో రాష్ట్రవ్యాప్తంగా కేడర్, నాయకత్వ బలం ఉంది. ఇక అందులోని అసంతృప్తిని క్యాష్ చేసుకొని నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను ఆకర్షించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మిషన్ 90లో నేతలు సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ఇతర పార్టీల నుంచి వలసలు అవసరం బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇంత తక్కువ బలం ఉండి గెలవడం అసాధ్యం అని.. ఇతర పార్టీల నుంచి లాగాల్సిందేనని డిసైడ్ అయ్యింది. ప్రధానంగా కాంగ్రెస్ పై పడి నేతలను తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా? లేదా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.