వ్యాపమ్... భారతదేశమంతా ఇప్పుడు దీనిపైనే చర్చ... దేశం నడిబడ్డున ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈవ్యాపమ్ కుంభకోణం పెద్ద మిస్టరీగా మారిపోయింది... ఇదేమీ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కాదు... అంతర్జాతీయ మాఫియాలూ ఇందులో లేవు... అయినా... ఈ కుంభకోణంలో సాక్షులుగా ఉన్నవారంతా ఒక్కరొక్కరుగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు... దీని సంగతేంటో తేల్చాలని ప్రయత్నించేవారు నిమిషాల్లోనే మృత్యువుకు చేరువవుతున్నారు. విద్యార్థులు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, ఏకంగా ఆ రాష్ట్ర గవర్నరు రాంనరేశ్ యాదవ్ కుమారుడు కూడా ఈ కుంభకోణం నేపథ్యంలోనే అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ కుంభకోణంలో ఆరోపణలున్న కేంద్రమంత్రి ఉమాభారతి కూడా రెండు రోజుల కిందట తనకు ప్రాణభయం ఉందని చెప్పారు. తననూ చంపేస్తారేమో అని ఆమె ఆందోళన చెందారు. ఇవి చాలు... ఈకుంభకోణం వెనుక ఉన్నవారు ఎంతటి నరహంతకులో... దేనికైనా సిద్ధమైనవారో అర్థం చేసుకోవడానికి. తాజాగా ఈకేసును సీబీఐకి ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
వ్యాపమ్ అంటే వ్యావసాయిక్ పరీక్ష మండల్... మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ బోర్డుకు ఇది మరో పేరు. ఉపాధ్యాయులు.. పోలీసు కానిస్టేబుళ్లు, వైద్యాధికారులు మొదలైన ఎన్నో ఉద్యోగాలకు ఈ బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే... 2004 నుంచి ఈ పరీక్షల్లో చాలా వ్యవస్థీకృతంగా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయం 2009లో బయటపడింది. ఆనంద్ రాయ్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త దీన్ని బయటపెట్టాడు. ఒకరికి బదులు వేరొకరితో పరీక్షలు రాయిస్తున్నారు... డబ్బులిచ్చినవారికి పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేస్తున్నారని... ఇలా రకరకాల ఆరోపణలున్నాయి. మొత్తానికి ఈ నియామకాలన్నీ పూర్తిగా అక్రమాలమయంగా మారాయి. వందలాదిమందికి అక్రమంగా నియమించి అర్హులకు అన్యాయం చేశారు. దీని వెనుక రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2009లో దీనిపై విచారణకు కమిటీ వేయగా 2013 నాటికి కుంభకోణం మొత్తం బయటపడింది. ఈ మండలి నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్ట్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ప్రీ పీజీ, సుబేదార్ వంటి పరీక్షల్లో కోట్ల రూపాయాలు చేతులు మారాయని తేల్చారు. వందలాది మంది అక్రమంగా నియామకాలు ఇచ్చారనీ తేల్చారు. 77 లక్షల మంది అభ్యర్థుల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఎవరెవరు ఉన్నారు...
ఈ కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, గవర్నరు రాంనరేశ్ యాదవ్‌లకు ప్రత్యక్ష సంబంధముందని ఆరోపణలున్నాయి. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఆనంద్‌రాయ్ దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. మొత్తం 2500 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 61 కేసులు నమోదయ్యాయి. 2000 మందిని అరెస్టు చేశారు. 1900 మంది జైళ్లలో ఉన్నారు. 2014లో సీబీఐ విచారణకు డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా సుప్రీం సీబీఐ విచారణకు ఆదేశించింది. మాజీ మంత్రి, బీజేపీ నేత లక్ష్మీకాంతశర్మ, వినోద్ భండారీ, వ్యాపంలో కీలక అధికారులు ఓపీ శుక్లా, పంకజ్ త్రివేది, మైనింగ్ వ్యాపారి సుధీర్ శర్మ, ఐపీఎస్ అధికారి శివ్‌హరే మొదలైనవారంతా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు.
చంపేస్తున్నారు...
కాగా ఈ కేసు పూర్తిస్థాయిలో బయటకొచ్చిన 2013 నుంచి కోల్డ్‌బ్లడెడ్ మర్డర్స్ మొదలయ్యాయి. ఎవరినైనా విచారణకు పిలుస్తారంటే చాలు వారు మరణిస్తున్నారు... అనుమానాస్పద స్థితిలో శవమవుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఒక ఎస్సై, ఒక మెడికల్ స్టూడెంట్, గవర్నరు రాంనరేశ్ కుమారుడు ఇలా సుమారు 48 మంది ఇప్పటికి చనిపోయారు.
దారుణమేంటంటే ఇలా చనిపోయిన మెడికల్ స్టూడెంట్ నమ్రత మరణంపై పరిశోధనకు వచ్చిన ఒక పెద్ద మీడియా సంస్థ జర్నలిస్టు కూడా మరణించాడు. ఎవరి మరణాలకూ కారణాలు తెలియడం లేదు.. ఆధారాలు దొరకడం లేదు.. కొన్ని కేసుల్లో పాయిజన్ ఆనవాళ్లు కనిపించాయి. మెడికల్ స్టూడెంటు మృతిని ఆత్మహత్యగా చూపించారు. అయిదుగురివి ఆత్మహత్యలుగా చెబుతుంటే... మరో 11 మందివి యాక్సిడెంటు మరణాలుగా చూపించారు. మిగతావారివన్నీ అనుమానస్పద మరణాలుగానే కేసులు నమోదయ్యాయి.
నమ్రతది ఆత్మహత్యగా చిత్రీకరించారు. రైలు పట్టాలపై ఆమె మృతదేహం ఉండడంతో ఆత్మహత్యగానే కేసు క్లోజ్ చేశారు. నిజానికి ఆమె చనిపోవడానికి ముందు ఆమెకు ఒక నంబరు నుంచి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి... అది ఈ స్కాంలో నిందితుడి నంబరు... నమ్రతను రేప్ చేసి చంపేసి రైలు పట్టాలపై పడేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది... నిందితుడిని డీఎన్‌ఏ పరీక్షకు పంపించి కూడా వదిలిపెట్టారన్న ఆరోపణలున్నాయి... ఈ కుంభకోణంలో మరణాలన్నిటిపైనా మధ్యప్రదేశ్ పోలీసుల తీరు అనుమానాస్పదంగానే ఉంది.
కాగా ఇంతవరకు ఈ కుంభకోణంలో 2 వేల మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ వారంతా లంచాలిచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... పరీక్షలో అక్రమాలకు పాల్పడినవారే కానీ... దీనంతటినీ తెరవెనుక ఉండి నడిపించినవారిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. సీబీఐ విచారణతోనైనా అసలు దోషులెవరో తేల్చడమే కాకుండా ఈ ఊచకోతకు ముగింపు పలకాలని దేశం కోరుకుంటోంది.