Begin typing your search above and press return to search.

పెద్ద‌నోట్ల ర‌ద్దుకు జాతి చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Aug 2018 4:59 AM GMT
పెద్ద‌నోట్ల ర‌ద్దుకు జాతి చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా?
X
గుట్టుగా.. ఎవ‌రికీ చెప్ప‌కుండా.. కేబినెట్ స‌భ్యుల్ని ఒక గ‌దిలో పెట్టి.. జాతిని ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగిస్తూ.. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా చేసిన ప్ర‌క‌ట‌న ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ నిర్ణ‌యణాన్ని ప్ర‌క‌టిస్తూ.. న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌భుత్వం సంధించిన అస్త్రంగా పేర్కొన‌ట‌మే కాదు.. మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో దేశంలో కుప్ప‌లుతెప్ప‌లుగా ఉన్న బ్లాక్ మ‌నీ అంత ఆగిపోతుంద‌ని చెప్ప‌టం తెలిసిందే.

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో వెన‌క్కి వ‌చ్చిన పెద్ద‌నోట్ల‌ను లెక్కించిన ఆర్ బీఐ.. త‌న తాజా నివేదిక‌ను 21 నెల‌ల త‌ర్వాత వెల్ల‌డించింది. బ్యాంకుల‌కు వ‌చ్చిన పెద్ద‌నోట్ల‌ను లెక్కించే కార్య‌క్ర‌మం పూర్తి అయింద‌ని పేర్కొంటూ.. ర‌ద్దు చేసిన నోట్ల‌లో 99.3 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల‌కు చేరిన‌ట్లుగా పేర్కొన్నారు.

దీనిపై కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్న ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న డిమాండ్ చేశారు.

తాను త‌ప్పు చేస్తే శిక్షించాల‌ని నాడు మోడీ అన్నార‌ని.. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంలో ఆయ‌న త‌ప్పు చేసిన‌ట్లుగా తాజాగా రుజువైంద‌ని కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక రంగంపై జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడుల కార‌ణంగా మ‌ళ్లీ కోలుకోలేని దెబ్బ తీసిన‌ట్లుగా ఖ‌ర్గే మండిప‌డ్డారు.

ర‌ద్దు చేసిన నోట్ల‌లో రూ.3ల‌క్ష‌ల కోట్లు వెన‌క్కి రావ‌ని.. అదంతా న‌ల్ల‌ధ‌న‌మ‌ని.. ప్ర‌భుత్వానికి లాభ‌మ‌ని ఆర్థిక‌మంత్రి జైట్లీ చెప్పార‌ని.. ఆర్ బీఐ తాజా నివేదిక నేప‌థ్యంలో ఏమంటార‌ని ప్ర‌శ్నించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా వంద ప్రాణాలు పోయాయ‌ని.. 15 కోట్ల మంది దిన‌స‌రి వేత‌న జీవులు రోడ్డు మీద ప‌డ్డార‌ని.. అనేక చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ‌ట‌మే కాదు.. జీడీపీలో సుమారు 1.5 శాతం వృద్ధి దెబ్బ తిన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ ఒక్క‌దాని విలువ ఏటా రూ.2.25ల‌క్ష‌ల కోట్లుగా వెల్ల‌డించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోట్లాది ప‌ని గంట‌లు బ్యాంకుల ఏటీఎంల ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాసేందుకు.. త‌మ ద‌గ్గ‌రున్న పెద్ద‌నోట్ల‌ను మార్చుకోవ‌టానికి వెచ్చించాల్సి వ‌చ్చింది.దీనికి వెల క‌డితే.. పెద్ద‌నోట్ల ర‌ద్దుకార‌ణంగా దేశ ప్ర‌జ‌లకు జ‌రిగిన న‌ష్టం భారీగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్పదు. మ‌రి.. త‌న నిర్ణ‌యం ఇంత దారుణంగా ఫెయిల్ కావ‌టానికి కార‌ణం ఏమిటో.. మోడీ క‌నీసం త‌న మ‌న్ కీ బాత్ లో అయినా చెబుతారంటారా?