Begin typing your search above and press return to search.

కేసీఆర్ సన్నాయికి తెలంగాణ ప్రజల రియాక్షన్ ఎలా ఉండనుంది?

By:  Tupaki Desk   |   4 July 2021 2:40 PM GMT
కేసీఆర్ సన్నాయికి తెలంగాణ ప్రజల రియాక్షన్ ఎలా ఉండనుంది?
X
చెప్పింది వినటం.. ఆపై తలూపటం.. మిగిలిన చోట్లకు వర్కువుట్ అవుతుందేమో కానీ తెలంగాణకు మాత్రం ఇది వర్తించదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముగిసి.. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దశాబ్దాల కొద్దీ వెయిట్ చేసింది తెలంగాణ సమాజం. తప్పులు సరిదిద్ది.. తమ ఆకాంక్షలు తప్పని తేలిస్తే.. కలిసి సాగటానికి తమకు అభ్యంతరం లేదన్నట్లే వ్యవహరించింది. కానీ.. ప్రజల భావోద్వేగాల్ని పాలకులు పట్టించుకోకపోవటం తెలుగుజాతికి శాపంగా మారింది. ఒకే భాష మాట్లాడే జాతి.. రెండు రాష్ట్రాలుగా విడిపోవటం తప్పేం కాదు. ఎవరి ఆకాంక్షలకు తగ్గట్లు వారు వ్యవహరించటం.. ఎవరి దారిన వారు బతకటాన్ని తప్పు పట్టలేం.

కాకుంటే సమస్యంతా.. నిద్ర లేచింది మొదలు ఏదో ఒక పేచీ పెట్టుకున్నట్లుగా వ్యవహరించటంలోనే ఇబ్బంది అంతా. ఒక కుటుంబంలో రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల మధ్యే ఏకాభిప్రాయం ఉండదు. తండ్రి ఆస్తిని పంచుకునే వేళ.. సవాలచ్చ వాదనలు జరుగుతాయి. అలాంటిది ఒక రాష్ట్రం కాస్తా రెండుముక్కలైన వేళ.. పంచాయితీలు సహజం. వాటిని చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి నిప్పు రాజేసినట్లుగా.. భావోద్వేగాల్ని రెచ్చగొట్టటం.. మహా అన్యాయం జరుగుతుందని గుండెలు బాదుకోవటం సరికాదు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నష్టం వాటిల్లిందన్న వాదనలో నిజం ఎంత ఉన్నదో.. రాయలసీమకు అంతే నష్టం వాటిల్లిందన్నది వాస్తవం. అలాంటప్పుడు తెలంగాణకు విభజనతో న్యాయం జరిగినప్పుడు..రాయలసీమను పట్టించుకోరా? అన్నది ప్రశ్న. హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పుడు మిగులు బడ్జెట్ ఉండేదన్న కేసీఆర్ వాదనకు తగ్గట్లే.. రాష్ట్ర విభజన చేసినప్పుడు తెలంగాణకు మిగులు బడ్జెట్ అందజేశారు. మరీ..రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

ఏడేళ్ల సొంత పాలనలో తెలంగాణలో ఏం జరిగిందన్నది ఈ రోజున తెలంగాణ ప్రజానీకానికి ఎవరో ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. తమ కళ్లతోనే చూస్తున్నారు. ఉద్యమం వేళలో తమ కళ్ల ముందు తిరిగిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వారేం చేస్తున్నారు? వారెంత సంపాదించారు? వారు చేసే దందా ఏమిటి? అన్న విషయాల మీద అందరికి అన్ని తెలుసు. అదే సమయంలో విలువల కోసం.. నమ్మిన సిద్ధాంతాల కోసం నడిచే వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందన్నది కూడా తెలిసిందే.

విడిపోయి కలిసి ఉందామన్న ఉద్యమ ప్రాథమిక నినాదాన్ని పక్కన పెట్టేసి.. ముందుగా చేసుకున్న ఒప్పందాల్ని కాలదన్ని.. యుద్ధానికి సిద్దమన్నట్లుగా శంఖారావాలు పూరించటాన్ని తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా? అన్నది అసలు ప్రశ్న. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు అన్నట్లు ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు చేస్తామని చెబుతున్న నీటి యుద్ధంలో లొసుగులు చాలానే ఉన్నాయి. ప్రజా ప్రయోజనం కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి.

విభజనకు ముందు తెలంగాణ సమాజానికి తాము దగా పడిన వైనంపై అంతులేని ఆవేదన ఉంది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. అదే సమయంలో విభజనతో తమకు జరిగిన నష్టానికి తగిన లాభం జరిగినట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి జరిగిన నష్టాన్ని గుర్తించారు. చివరకు సీఎం కేసీఆర్ సైతం విభజన కారణంగా ఏపీ నష్టపోయిన వైనాన్ని తన మాటలతో పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కత్తులు దూసుకునే కన్నా..కూర్చొని మాట్లాడుకోవటానికి ఇష్టపడాలి. అంతే తప్పించి.. రోడ్డు మీదకు వస్తామంటే ఒప్పుకునే వారెవరూ లేరు.

ఉద్యమ వేళలో కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలకు తెలంగాణ సమాజం మొత్తం తలూపేది. దానికి కారణం.. అందులోని నిజాయితీనే. ఇప్పుడు అలాంటిది లోపించినప్పుడు తెలంగాణ కోసం తాను చేస్తున్న పోరాటానికి ప్రజల దన్ను ఉంటుందనుకోవటం అత్యాశే అవుతుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పోరును గుర్తించలేనంత చైతన్యరహితంగా తెలంగాణ సమాజం లేదన్నది మర్చిపోకూడదు. ఏడేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చూసిన ప్రజలకు.. ఆయన ఎప్పుడే పని చేస్తారు. ఎప్పుడు ఎలా మాట్లాడతారన్న విషయంలో అవగాహన బాగానే ఉంది.

ఈ కారణంతోనే.. క్రిష్ణానీటిపై ఆయన చేస్తున్నవ్యాఖ్యలపై అంత సానుకూలత రావట్లేదు. ఈ విషయాన్ని గుర్తించటం వల్లే కావొచ్చు.. ఇప్పుడు తన రూటును మరికాస్త మార్చుకొని ఒప్పందాల్ని సైతం ఉల్లంఘిస్తాం.. మేం చెప్పిందే చేయాలన్న వరకు వెళ్లటాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన వాయించే సన్నాయికి తలూపే పరిస్థితి లేదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం. ఈ విషయాల్ని కేసీఆర్ గమనిస్తున్నారా?