Begin typing your search above and press return to search.

పైపై మెరుగులేనా? క్షేత్ర‌స్థాయిలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి..?

By:  Tupaki Desk   |   8 May 2023 12:15 PM GMT
పైపై మెరుగులేనా? క్షేత్ర‌స్థాయిలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి..?
X
రాష్ట్రంలో ఒక‌వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మ‌రోవైపు ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకే ష్ విజృంభిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను తూర్పార బ‌డుతున్నారు. అయితే..ఇవ‌న్నీ పైపైమెరుగులుగానే క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎందుకంటే..ప్ర‌స్తుతం చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డా.. నారా లోకేష్ గ‌ళం విప్పినా.. వినేందుకు.. ప్ర‌చురించేందుకు ప్ర‌సారం చేసేందుకు బాగానే ఉన్నాయి.

కానీ, రేపు ఎన్నిక‌ల నాటికి ఇవ‌న్నీ తుడిచిపెట్టుకుపోయి.. క్షేత్ర‌స్థాయ‌లో ప‌రిస్థితి ప్ర‌ధానంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. గ‌త ఎన్నిక‌లు.. అంత‌కు ముందు జ‌రిగిన 2014 ఎన్నిక‌లు కూడా.. టీడీపీకి ఇలాంటి అనుభ‌వాన్నే నేర్పాయి.

అప్ప‌ట్లోనూ చంద్ర‌బాబు గ‌ళం వినిపించారు. కానీ, ఫ‌లితం క‌నిపించ‌లేదు. 110 సీట్ల‌కు అటు ఇటుగానే 2014లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, 2019 కి వ‌చ్చేస‌రికి దారుణంగా 23కు స‌రిపుచ్చుకుంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం క్షేత్ర‌స్థాయిలో టీడీపీని అంచ‌నా వేయ‌డంలోనూ.. పార్టీని న‌డిపించేవారిని ఎంపిక చేయ‌డంలోనూ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేది ప్ర‌ధాన వాద‌న‌. దీనిని స‌రిదిద్దుకుని.. కీల‌క‌మైన నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. పార్టీ గాడిన ప‌డుతుంద‌నే సూచ‌న‌లు.. స‌ల‌హాలు వ‌స్తున్నా.. వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఆచ‌ర‌ణ‌లో పెట్టింది లేదు. మ‌రి ఇప్పుడైనా ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

ఇదిలావుంటే.. మ‌రోవైపు, వైసీపీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునే దిశ‌గా నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతున్నారు. అధినేత అక్క‌డే కూర్చున నాయ‌కుల‌ను ఇంటింటికీ పంపుతున్నారు.

ఈ త‌ర‌హా వ్యూహంతో వైసీపీ బ‌ల‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. టీడీపీ మాత్రం.. ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిపై దృష్టి పెడ‌తారో లేదో చూడాలి.