Begin typing your search above and press return to search.

కేసీఆర్ డెడ్ లైన్ కు స్పందన ఎంతంటే?

By:  Tupaki Desk   |   6 Nov 2019 7:19 AM GMT
కేసీఆర్ డెడ్ లైన్ కు స్పందన ఎంతంటే?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ కు స్పందన కొరవడింది. నాలుగు వారాలకు పైగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఎం డెడ్ లైన్ విధించటం.. మంగళవారం అర్థరాత్రి లోపు ఉద్యోగులు భేషరతుగా విధుల్లో చేరుతున్నట్లు లేఖ రాసి ఇస్తే.. వారి విషయం తాను చూసుకుంటానని చెప్పటం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరని పక్షంలో మిగిలిన బస్సుల్ని ప్రైవేటీకరిస్తానని స్పష్టం చేయటం తెలిసిందే.

ఇంత తీవ్రమైన హెచ్చరిక చేసినప్పటికీ ఆర్టీసీ కార్మికుల నుంచి వచ్చిన స్పందన తక్కువేనని చెప్పలి. ఎందుకంటే.. రాష్ట్రంలో ఉన్న 48 వేలకు పైన కార్మికులు ఉంటే.. కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరతామని లేఖలు ఇవ్వటం గమనార్హం. లేఖలు ఇచ్చిన 360 మందిలో బస్ భవన్ లోని పరిపాలన సిబ్బంది 200 మంది వరకూ ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో 62 మంది ... హైదరాబాద్ జోన్ లో 31 మంది.. ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మంగళవారం అర్థరాత్రి వరకూ ఎంతమంది కార్మికులు విధులు నిర్వర్తించటానికి లేఖలు ఇచ్చారన్న విషయంపై అధికారిక ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ రోజుతో సమ్మె 33వ రోజుకు చేరినట్లైంది. సీఎం అల్టిమేటం నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ వెనక్కి తగ్గేది లేదంటూ శపధాలు.. మానవహారాలు.. నిరసనల్ని చేపట్టారు.

ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై మొదట్నించి సానుకూలంగా లేని ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజా పరిణామాలపై ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ గడువుపు పొడిగిస్తే కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు ఉంటుంది. అదే సమయంలో.. కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే.. దానిపై ఆర్టీసీ ఉద్యోగులు ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతుందని చెప్పక తప్పదు. మరిప్పుడు సారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.